విశాఖలో కోర్టుకు హాజరైన అనంతరం మంత్రి నారా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. దావోస్ లో తాము ఎంతో శ్రమించామని, కానీ వైసీపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్కే రోజాకు దావోస్‌కు, జ్యూరిచ్‌కు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. జ్యూరిచ్ లో తెలుగువారితో సమావేశమయినప్పుడు ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా రెడ్ బుక్ గురించి మాట్లాడాను... రెడ్ బుక్ గురించి దావోస్ లో మాట్లాడలేదు.... ఆ విషయం వైసీపీ నేతలు గ్రహించాలి... అయినా రెడ్ బుక్ గురించి ఎందుకు వారికంత భయం? అని లోకేశ్ ప్రశ్నించారు. "ఒక్కో పారిశ్రామికవేత్తను ఒప్పించడానికి కష్టపడాల్సి వస్తోంది. కాగ్నిజెంట్‌ను వారి పెవిలియన్‌కు వెళ్లి కలిశాను. మన పిల్లల కోసం వెళ్లాను. త్వరలోనే విశాఖ, ఉత్తరాంధ్రకు గుడ్ న్యూస్ వస్తుంది" అని వివరించారు.నన్ను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే చూడండి. చంద్రబాబు గారు ఏ బాధ్యతలు ఇచ్చినా అహర్నిశలు కష్టపడి పనిచేస్తా. పార్టీని బలోపేతం చేస్తా. పార్టీకి చెడ్డపేరు మాత్రం తీసుకురాను. పాదయాత్ర చేశాను. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా క్రమశిక్షణతో పనిచేస్తా. ఒక వ్యక్తి మూడుసార్లు కంటే ఒక పదవిలో ఉండకూడదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను కూడా ఈసారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండకూడదని భావిస్తున్నా. గ్రామపార్టీ నుంచి పొలిట్ బ్యూరో వరకు పార్టీలో చైతన్యం రావాల్సి ఉంది. దీనిపై పార్టీ పెద్దలు నిర్ణయిస్తారు... అని లోకేశ్ స్పష్టం చేశారు.