తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ స్లీపర్ దాదాపు ఖరారైంది. కొద్ది రోజుల్లోనే వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఈ రైళ్ల కోసం భారీగా డిమాండ్ ఉంది.ఇక, ఏపీ నుంచి ఇప్పటికే రెండు వందేభారత్ స్లీపర్ రైళ్ల కోసం ఎంపీలు రైల్వే శాఖకు ప్రతిపాదించారు. వీటి పైన అధ్యయనం కొనసాగుతుండగానే.. తాజాగా ఏపీ నుంచి వారణాసికి వందేభారత్ స్లీపర్ కేటాయించాలనే ఏపీ ముఖ్యుల సూచన మేరకు రైల్వే శాఖ ఫోకస్ చేసింది. ఈ మేరకు కసరత్తు మొదలైనట్లు సమాచారం.తెలుగు రాష్ట్రాల నుంచి వారణాసి, అయోధ్యకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్నారు. కానీ, రెగ్యులర్ రైళ్లల్లో భారీగా వెయిటింగ్ లిస్టు కనిపిస్తోంది. దీంతో, తెలుగు రాష్ట్రాల నుంచి వారణాసి, అయోధ్యకు కనెక్ట్ చేస్తూ కొత్తగా వందేభారత్ స్లీపర్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. ఈ మేరకు రైల్వే శాఖ నుంచి సానుకూల స్పందన వస్తోంది. కాగా.. విశాఖ - సికింద్రాబాద్, కాచిగూడ - యశ్వంత్ పూర్, విజయవాడ - చెన్నై, సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైళ్లను ఆశించిన స్థాయిలో ఆక్యెపెన్సీ ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇక, ఏపీ నుంచి దూరపు ప్రాంతా లకు చేరుకునేందుకు వందేభారత్ స్లీపర్ రైళ్ల కేటాయింపు పైన తెలుగు రాష్ట్రాల ఎంపీల నుంచి రైల్వే శాఖపై ఒత్తిడి పెరుగుతోంది.
విశాఖ నుంచి తిరుపతి, విశాఖ నుంచి బెంగళూరు కు వందేభారత్ స్లీపర్ కేటాయించాలని ఇప్పటికే నేరుగా రైల్వే మంత్రికి వినతులు అందాయి. ఇక, విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్ ఏర్పాటు పైన అధ్యయనం కొనసాగుతోంది. విజయవాడ నుంచి చెన్నైకు ప్రస్తుతం వందేభారత్ కొనసాగుతోంది. బెంగళూరుకు ఏర్పాటు చేయటం ద్వారా ప్రయోజన కరంగా ఉంటుందనే వినతులు రైల్వే బోర్డుకు చేరాయి. అయితే, వందే భారత్ స్లీపర్ కోసం దేశ వ్యాప్తంగా వస్తున్న డిమాండ్ ను పరిగణలోకి తీసుకొని కేటాయింపు లు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. కానీ, ఇదే సమయంలో ఏపీ నుంచి అయోధ్య, వారణాసి కి వందేభారత్ స్లీపర్ కేటాయింపులో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని రైల్వే మంత్రిని ఏపీ ముఖ్య నేతలు కోరటంతో కసరత్తు మొదలైంది
విజయవాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా అయోధ్య - వారణాసికి వందేభారత్ స్లీపర్ కేటాయింపు పైన స్పష్టమైన హామీ దక్కింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే నుంచి ప్రతిపాదనలు ఇవ్వాలని కోరినట్లు సమాచారం.వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్లాలెక్కిన తరువాత విజయవాడ నుంచి అయో ధ్య, వారణాసి కి కేటాయింపు పైన తొలి రెండు విడతల్లోనే ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ రైళ్లు ప్రయాణించే మార్గంలోనే వందేభారత్ స్లీపర్ ను అయోధ్య - వారణాసికి కేటాయించేలా నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. రాత్రి సమయంలోనే ఈ రైలు ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ రైలు అందుబాటులోకి వస్తే అయోధ్య, వారణాసి వెళ్లాలనుకునే తెలుగు ప్రజలకు వరంగా మారనుంది.