అన్యాయానికి గురైన సామాన్యులు పోలీసు స్టేషన్‌కు వెళితే రికమెండేషన్ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసే రోజు రావాలని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు. 35ఏళ్ల క్రితం తాను యూనిఫామ్ వేసుకున్న రోజల్లో పరిస్థితికి.. ఇప్పటికి చాలా మార్పు వచ్చిందన్న ఆయన సామాన్యుడి కోసం పూర్తి నిష్పక్షపాతంగా పనిచేసే పోలీసు వ్యవస్థ సాకారం కావాల్సి ఉందన్నారు. ఐపీఎస్ అధికారిగా సమాజానికి చేసిన సేవ సంతృప్తి నిచ్చిందని.. కసబ్ లాంటి ఉగ్రవాదిని ఇంటరాగేట్ చేయడం.. కొల్లం గంగిరెడ్డి లాంటి ఎర్రచందనం స్మగ్లర్‌ను విదేశాల నుంచి తీసుకు రావడం లాంటివి వృత్తి జీవితంలో మరపు రానివని పేర్కొన్నారు. మరోవైపు రైల్వే ఏడీజీగా పనిలేక బాధపడిన రోజులూ ఉన్నాయని తిరుమల రావు నెమరువేసుకున్నారు.
రాష్ట్రానికి చెందిన ద్వారకా తిరుమల రావు 1989లో ఐపీఎ్‌సకు ఎంపికై సొంత రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసి రాష్ట్ర పోలీస్ బాస్ హోదాలో శుక్రవారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో గురువారం విలేకర్లతో పలు అంశాలు ముచ్చటించారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో చెయ్యాల్సిన పని సక్రమంగా చేశానన్న సంతృప్తి ఉందని ద్వారకా అన్నారు. నేరాల తీరుతెన్నుల్లో మార్పులు ఎప్పటికప్పుడు పోలీసులకు సవాలుగా నిలుస్తాయని, ప్రస్తుతం మన రాష్ట్రంలో టెక్నాలజీ వినియోగం పెంచి నేరాలు కట్టడి చేస్తున్నామని చెప్పారు. విజయవాడ, ఏలూరు పోలీసులు ఏఐ వినియోగించి పలు కేసులు పరిష్కరించారన్నారు.