ఏడాదిగా తనతో స్నేహంగా ఉంటున్న సహోద్యోగిని తాము పనిచేసే కంపెనీలో తనపై ఫిర్యాదు చేసిందనే ఆందోళనతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో జరిగిన ఈ ఘటనలో జగిత్యాలకు చెందిన పిప్పరి వినీత్(26) మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాలకు చెందిన పిప్పరి వినీత్(26), అతని చెల్లెలు సంయుక్త హైదరాబాద్ ఈస్ట్‌మారేడుపల్లిలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.
అన్నాచెల్లెళ్లు ఇద్దరూ బేగంపేటలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. అదే సంస్థలో పని చేసే మరో యువతితో వినీత్‌కు ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. ఏడాదిగా చాటింగ్ చేసుకుంటున్న వీరి ఒకరి కోసం మరొకరు తెలుసుకున్నారు. అయితే, ఇటీవల ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో సదరు యువతి సంస్థ హెచ్ఆర్కు వినీత్‌పై ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసి ఆందోళన చెందిన వినీత్ బుధవారం విధులు పూర్తి చేసిన తర్వాత తన ద్విచక్రవాహనంపై దండుమల్కాపురం శివారులోని ఓ పైపుల పరిశ్రమ దగ్గరికి వెళ్లాడు. రాత్రి 11గంటల సమయంలో చెల్లెలు సంయుక్తకు ఫోన్ చేసి .. సదరు యువతి అకారణంగా తనపై ఫిర్యాదు చేసిందని, ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పారు. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తన లోకేషన్ పంపి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అనంతరం ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పుపెట్టుకున్నాడు. సంయుక్త తన బంధువులతో కలిసి ఆ ప్రాంతానికి చేరుకునే సరికి వినీత్ శరీరం పూర్తిగా కాలిపోయింది. వినీత్ తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.