మహారాష్ట్రలో చాప కింద నీరులా వ్యాపిస్తున్న ఈ వ్యాధి తెలంగాణలో కూడా కలకలం రేపింది. సిద్ధిపేట జిల్లాకు చెందిన ఓ మహిళలో ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆమె కిమ్స్ ఆసుపత్రి, హైదరాబాద్‌లో చికిత్స పొందుతుంది. మరోవైపు మహరాష్ట్రలోని పుణెలో ఈ కేసుల సంఖ్య వంద దాటింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అయితే, గులియన్ బారే సిండ్రోమ్ అంటే ఏంటి? లక్షణాలు, కారణాలతో పాటు పూర్తి వివరాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం.
గులియన్ బారే సిండ్రోమ్ అంటే ఏంటి?
గులియన్ బారే సిండ్రోమ్ అనేది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ న్యూరోలాజికల్ డిజార్డర్. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి గులియన్ బారే సిండ్రోమ్ ముప్పు ఎక్కువగా ఉంటుందని డాక్టర్ తెలిపారు. అయితే, ఇది నరాలపై ఎక్కువగా దాడి చేస్తుంది. దీంతో రోగులు లేవడానికి, కూర్చోవడానికి, నడవడానికి ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు పక్షవాతానికి గురవుతున్నారు. వాస్తవానికి, మన నాడీ వ్యవస్థ రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగాన్ని కేంద్ర నాడీ వ్యవస్థ అని పిలుస్తారు. ఇందులో వెన్నుపాము, మెదడు భాగం ఉంటాయి. రెండవ భాగం మొత్తం శరీరం యొక్క నరాలను కలిగి ఉన్న పరిధీ వ్యవస్థ. నాడీ వ్యవస్థలోని మరొక భాగాన్ని అంటే పరి నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది.
లక్షణాలు
సాధారణంగా, ఈ వ్యాధితో బాధపడుతున్న వారు చేతులు, కాళ్ళలో జలదరింపు, బలహీనత అనుభూతి చెందుతున్నారు. ఈ లక్షణాలు వేగంగా వ్యాపించి పక్షవాతంగా మారవచ్చు. రోగి నడకలో బలహీనత, మెట్లు ఎక్కడం కష్టంగా మారడం, మాట్లాడటంలో తడబాటు, నమలడం లేదా మింగడంలో ఇబ్బంది వంటి సమస్యలను కూడా అనుభవించవచ్చు. కళ్లను కదల్చడంలో ఇబ్బంది, తీవ్రమైన శరీర నొప్పులు, మూత్ర, మల విసర్జనలో సమస్యలు, అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి వ్యాధి లక్షణాలు. అంతేకాకుండా రక్తపోటు వేగంగా పడిపోతుంది. దీని కారణంగా సెప్టిక్ దాడి వంటి పరిస్థితి కూడా తలెత్తుతుంది. దీంతో పరిస్థితి చేయి దాటి మరణం కూడా సంభవించవచ్చు.
వ్యాధికి కారణాలు
ఇప్పటికే వైరల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న రోగులు గులియన్ బారే సిండ్రోమ్‌కి సులభంగా బాధితులుగా మారవచ్చు. దగ్గు, జలుబు, జ్వరం, అతిసారం, ఏదైనా టీకా లేదా శస్త్రచికిత్స కారణంగా ఈ సిండ్రోమ్ శరీరంలోకి ప్రవేశించవచ్చు. అయితే మిగిలిన ఆహారం, బయట ఫుడ్స్, మురికి నీటి వల్ల ఈ సిండ్రోమ్ వస్తుంది మహారాష్ట్ర వైద్యాధికారులు ఓ నివేదికలో తెలిపారు. అందుకే వీటిగా దూరంగా ఉండాలని సూచించారు. పూణేలో కూడా బావిలోని నీరు తాగడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తికి కారణమని నమ్ముతున్నారు. అయినప్పటికీ ఇది ఇంకా ధృవీకరించబడలేదు.
వ్యాధిని ఎలా నివారించాలి?
సిండ్రోమ్ బారిన పడకుండా ఉండటానికి, వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షించుకోవడం చాలా ముఖ్యం. జ్వరం లేదా దగ్గుతో బాధపడుతుంటే శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఇది సిండ్రోమ్‌ని ప్రేరేపించడంలో సాయపడుతుంది. ఈ వ్యాధిని నివారించడం కోసం కాచిన నీటిని తాగాలి. అంటే పరిశుభ్రమైన నీటిని మాత్రమే తాగాలి. నిల్వ చేసిన పాల ఉత్పత్తుల వల్ల ఈ సిండ్రోమ్ వేగంగా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే నిల్వ చేసిన పాల ఉత్పత్తులకి దూరంగా ఉండాలి. పాలు ఉత్పత్తులు తాజాగా ఉన్నప్పుడే తీసుకోవాలి. అయినప్పటికీ కండరాలలో నొప్పి లేదా అకస్మాత్తుగా బలహీనత అనిపించినట్లయితే వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి.
ఈ వ్యాధి ఎంత తీవ్రమైంది?
గులియన్ బారే సిండ్రోమ్ చాలా మంది రోగులు చికిత్స తర్వాత కోలుకుంటున్నారు. అయితే, తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధికి ప్లాస్మా ఫెరిసిస్ ద్వారా చికిత్స చేయవచ్చు. రోగి వారం నుంచి 10 రోజుల లోపు ఆరోగ్యంగా మారవచ్చు. సకాలంలో చికిత్స చేస్తే 70-80 శాతం మంది రోగులు నయమవుతారు. కానీ కొన్ని తీవ్రమైన సందర్భాల్లో మాత్రమే, వారిని వెంటిలేటర్‌పై ఉంచుతున్నారు. వ్యాధితో బాధపడుతున్న 5 శాతం మంది మాత్రమే ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.