ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రక్తంలో పెరిగిన షుగర్ లెవల్స్‌ని తగ్గించే మెంతులు

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Jan 31, 2025, 11:48 PM

ప్రస్తుత కాలంలో డయాబెటిస్ అనేది అతి పెద్ద ముప్పుగా మారింది. డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలామంది ఈ మహమ్మారితో బాధపడుతున్నారు. డయాబెటిస్ వచ్చిన వారి రక్తంలో షుగర్ లెవల్స్ హెచ్చు తగ్గులకు గురవుతాయి. దీంతో శరీర కణాలకు శక్తి అందక అలసటగా అనిపిస్తుంది. ఇక, డయాబెటిక్ రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా చూసుకోవాలి. రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగితే డయాబెటిక్ రోగుల సమస్యలు ఇంకా పెరుగుతాయి.


రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగేకొద్దీ అది లోపలి నుంచి శరీరాన్ని దెబ్బతీస్తుంది. కంటి సమస్యలు, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు చాలా కాలం పాటు నియంత్రణలో లేకుండా అది అవయవాలకు హాని కలిగించే ప్రమాదం పెరుగుతుంది. అందుకే చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంచుకోవాలి. సాధారణ వ్యాయామం, సమతుల్య ఆహారం, సరైన జీవనశైలి పాటిస్తే డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని ఇంటి చిట్కాలు కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వంటింటిలో దొరికే మెంతులతో షుగర్ లెవల్స్‌ని అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిస్‌ ఉన్నవారు మెంతుల్ని ఎలా తీసుకోవాలి, వాటి ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.


మెంతులతో ఆరోగ్య ప్రయోజనాలు


​మెంతి ఆకులు, మెంతి గింజల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి కూరలకు రుచి ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మెంతుల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. హై బీపీ ఉన్నవారికి మెంతులు బాగా ఉపయోగపడతాయి. మెంతుల్లో గెలాక్లోమన్నన్ అనే సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నిర్వహించడంలో కూడా మెంతులు సమర్థవంతంగా పనిచేస్తాయి. మెంతుల్లో విటమిన్ కె ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముక ద్రవ్యరాశిని బలోపేతం చేస్తుంది. దీంతో ఎముకలు బలంగా మారతాయి. ఇలాంటి మెంతులు రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడానికి ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.


మెంతుల నీరు


ఉదయాన్నే ఖాళీ కడుపుతో మెంతుల నీరు తాగడం వల్ల మధుమేహం నిర్వహణలో చాలా సహాయపడుతుంది. మెంతుల నీరు శరీరాన్ని లోపల నుండి శుభ్రపరచడంలో సాయపడుతుంది. అంటే శరీరం లోపల నుంచి టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. అంతేకాకుండా మెంతుల నీరు తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ప్రతిస్పందన కూడా మెరుగుపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ వైద్యుల సలహా మేరకు మెంతుల నీటిని రోజు తాగవచ్చు.


మెంతుల నీరు ఎలా తయారు చేసుకోవాలి?


​మెంతుల నీరు కోసం ముందుగా ఓ రెండు టీ స్పూన్ల మెంతుల్ని తీసుకోండి. మెంతుల్ని ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని ఫిల్టర్ చేయండి. ఈ నీటిని ఖాళీ కడుపుతో తాగండి. కావాలంటే మీరు మెంతుల నీటిని కాసేపు మరిగించి.. చల్లార్చి గోరు వెచ్చగా కూడా తాగవచ్చు. రెగ్యులర్‌గా మెంతుల నీటిని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.


మెంతుల మొలకల సలాడ్


మొలకెత్తిన మెంతుల్ని తీసుకున్నా షుగర్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఇందుకోసం మెంతుల్ని రాత్రంతా నానబెట్టండి. ఆ తర్వాత మరుసటి రోజు నానబెట్టిన మెంతుల్ని శుభ్రమైన గుడ్డలో గాలిచొరబడకుండా కట్టండి. ఇలా చేసిన తర్వాత ఒకటి, రెండు రోజులు అలాగే ఉంచండి. ఆ తర్వాత మెంతులు మొలకలు వస్తాయి. వీటిని తినడం ద్వారా రక్తంలో షుగర్ లెవల్స్‌ని అదుపులో ఉంచుకోవచ్చు.


డయాబెటిస్‌లో మెంతుల ప్రయోజనాలు


మెంతుల నీరు తాగడం వల్ల శరీరంలో జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇది బరువు తగ్గడానికి సాయపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, శరీర బరువును తగ్గించడం కూడా రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా తగ్గించడంలో సాయపడుతుంది. మెంతుల నీరు తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిల్ని కూడా తగ్గించవచ్చు. మెంతుల్లో ఉండే మూలకాలు సిరల్లో పేరుకుపోయిన మురికిని తొలగిస్తాయి. అంతేకాకుండా మెంతుల్ని తీసుకోవడం ద్వారా జీర్ణశక్తి పెరుగుతుంది. దీంతో, డయాబెటిస్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చంటున్నారు నిపుణులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com