రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కాలేజీల్లో అక్రమాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకూ కళాశాల భవనాలు, ల్యాబ్‌లు, మౌలిక వసతుల అంశాల్లో ఎక్కువగా ఉల్లంఘనలు జరిగేవి. ఇప్పుడు అడ్మిషన్ల కోటాల్లో గోల్మాల్ చేస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. స్పాట్, మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్లలో 4,791 ఉల్లంఘనలు జరిగినట్లు ఉన్నత విద్యామండలి ఇటీవల తనిఖీల్లో గుర్తించింది. ఒక్కో ఉల్లంఘనకు రూ.2వేలు చొప్పున జరిమానా చెల్లించాలని స్పష్టం చేసింది. కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించకపోవడం వంటి సాధారణ ఉల్లంఘనలకు జరిమానాలు విధించడం లేదు.
మొత్తంగా 425 కాలేజీల్లో అడ్మిషన్ల ఉల్లంఘనలు జరిగితే వాటిలో 390 కళాశాలల్లో సీట్ల కేటాయింపు కోటాల్లో అవకతవకలను గుర్తించారు. ఒక కాలేజీలో గరిష్ఠంగా 55 శాతం సీట్లు సైన్స్, గణితం సబ్జెక్టులకు కేటాయించాల్సి ఉంటే, ఆ పరిమితిని దాటి ఇచ్చేశారు. అలాగే ఒక కోర్సులో తక్కువ సీట్లు భర్తీ అయి, మరో కోర్సుకు డిమాండ్ ఉంటే... డిమాండ్ ఉన్న కోర్సులో సీట్లు భర్తీచేసి ఖాళీగా ఉన్న కోర్సులో భర్తీ చేసినట్లుగా చూపిస్తున్నారు. ఆర్ట్స్ సీట్లను తీసుకొచ్చి సైన్స్‌లో చూపిస్తున్న ఉల్లంఘనలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. కాలేజీలో మొత్తం సీట్లు భర్తీ చేసుకోవడమే లక్ష్యంగా గ్రూపులను మార్చి చూపిస్తున్నారు. అయితే ఇప్పటికే విద్యార్థులకు తరగతులు జరుగుతున్నందున జరిమానాలు విధిస్తూ మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం విద్యార్థుల నుంచి వసూలు చేయకుండా యాజమాన్యాలే చెల్లించాలని స్పష్టం చేసింది. జరిమానా కట్టకపోతే చర్యలు తీసుకుంటామని పేర్కొంది.