స్టాఫ్ నర్సు ఉద్యోగాలిప్పిస్తామంటూ డబ్బులు డిమాండ్ చేసే ఆడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో విచారణ ప్రారంభించారు. జనవరి నెల 3వ తేదీన చిత్తూరు జిల్లాలో 150స్టాఫ్ నర్సు, 15 ఫార్మసిస్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. సుమారు 533 మందితో కూడిన అభ్యర్థుల మెరిట్ జాబితాను వైద్యఆరోగ్యశాఖ అధికారులు తాజాగా విడుదల చేశారు. అందులో అభ్యర్థుల ఫోన్ నెంబర్ సహా అడ్రస్ వివరాలున్నాయి. దీన్ని అదునుగా చేసుకున్న ఒక వ్యక్తి తన పేరు డి.బాలాజీ అంటూ అభ్యర్థులకు ఫోన్ చేసి ఉద్యోగాలిప్పిస్తామంటున్నాడు. 8981491288 నెంబరుతో అభ్యర్థులకు కాల్ చేసిన అతడు 601310110010709 నెంబరుతో ఉన్న బ్యాంకు అకౌంట్ నెంబరు ఇచ్చాడు. ఐఎ్‌ఫఎస్ కోడ్ ఆధారంగా సెర్చ్ చేయగా, అది ఢిల్లీలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ అని తేలింది. అభ్యర్థులతో మాట్లాడిన ఆడియో నెట్టింట వైరల్ కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే విచారణ ప్రారంభించారు.