టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలకమండలి శుక్రవారం సమావేశమైంది. రథసప్తమిని పురస్కరించుకుని ఏర్పట్లపై టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించింది. రథసప్తమి ఏర్పాట్లపై సభ్యులు, అధికారులతో సమావేశంలో చర్చించారు. భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు, సౌకర్యాలపై అధికారులకు టీటీడీ చైర్మన్ పలు సూచనలు చేశారు. సమావేశం అనంతరం బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 4వ తేది జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై పాలకమండలి సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.
సప్త వాహనాలపై శ్రీవారు తిరుమాడ వీధుల్లో ఊరేగి దర్శన భాగ్యం ఇస్తారని అన్నారు. రథసప్తమి నాడు ఉదయం 6:44 గంటలకు సూర్యోదయ గడియలు రానున్నాయని.. ఈ గడియల్లో స్వామి వారిని సూర్య కిరణాలు తాకుతాయని చెప్పారు. రథసప్తమిని పురస్కరించుకుని రెండు లక్షల మంది వస్తారని అంచనా వేశామన్నారు. రథసప్తమి నాడు ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేశామన్నారు. టైం స్లాట్ టికెట్స్‌ను ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు రద్దు చేశామని తెలిపారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగిన భక్తులకు నిర్ణీత సమయంలో దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పారు. రథసప్తమి సందర్భంగా 1250 మంది పోలీసులు, 1000 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.