రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంతి లోకేశ్ ప్రకటించారు. మార్చిలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియను ప్రారంభించి.. వచ్చే విద్యాసంవత్సరం మొదలయ్యే జూన్ నాటికి ఉపాధ్యాయులను భర్తీ చేస్తామని వెల్లడించారు. శుక్రవారమిక్కడ మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఉమ్మడి రాష్ట్రంలోను, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీలోనూ 80 శాతానికిపైగా టీచర్ల పోస్టులను టీడీపీ ప్రభుత్వాలే భర్తీ చేశాయని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛను కల్పిస్తూ ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం చర్చిస్తున్నామని తెలిపారు. వారి అభిప్రాయాలు సేకరించే.. ప్రభుత్వం ప్రతి నిర్ణయం తీసుకుంటోందన్నారు. విద్యాశాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటున్నారని, వారి సమస్యలను తెలుసుకుంటున్నారని చెప్పారు. తాను కూడా వారిని కలుస్తున్నట్లు తెలిపారు.