ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతరాత్రి ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆయన మిత్రపక్షం బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉన్న చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు. ఢిల్లీ మన రాజధాని అని, మనందరి ఆత్మగౌరవం అని ఉద్ఘాటించారు. "మన దేశానికి వచ్చే విదేశీయులు ముందుగా వచ్చేది ఢిల్లీకే. గత పదేళ్లుగా పాలనా వైఫల్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రపంచంలోనే అత్యధిక వెదర్ పొల్యూషన్, పొలిటికల్ పొల్యూషన్ ఢిల్లీలోనే ఉంది. చేసిన పనులు ఫలితాలు ఇవ్వకపోవడంతో కేజ్రీవాల్ ఏవేవో చెప్పి ప్రజల్ని పొల్యూట్ (కలుషితం) చేయాలని చూస్తున్నారు. ఢిల్లీ గల్లీల్లో మురికినీరు, మంచినీరు కలిసిపోవడంతో ప్రజలు కలుషిత నీరు తాగుతున్నారు. ఢిల్లీలో ఎక్కడ చూసినా అపరిశుభ్రతే కనిపిస్తోంది... అదే మైనస్. యమునా నది మొత్తంగా కలుషితమైంది. వాయు కాలుష్యం అయితే భరించలేని స్థితిలో ఉంది. ఢిల్లీకి ఎవరూ వచ్చేందుకు ఇష్టపడటం లేదు. బీజేపీతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం కనుక ప్రజలు ఆలోచన చేయాలి" అని సీఎం చంద్రబాబు అన్నారు.ఏపీకి అన్ని విధాలా మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ ఉంది. ఏఐ, గ్రీన్ ఎనర్జీ వంటి వినూత్నమైన పాలసీలతో మోదీ ప్రభుత్వం ముందుకెళుతోంది. దేశమంటే మట్టికాదోయ్ - దేశమంటే మనుషులోయ్ అని తెలుగుకవి గురజాడ అప్పారావు చెప్పిన సూక్తిని బడ్జెట్ తొలి వ్యాఖ్యాల్లో ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అమరావతికి ఈ ఏడాదిలోనే రూ. 15 వేల కోట్లు కేటాయించబోతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు ఇచ్చి కేంద్రం ఆదుకుంటుంది. పోలవరం ప్రాజెక్టుకు రూ.12,157 కోట్లు ప్రకటించిన కేంద్రం ఈ బడ్జెట్ లో రూ. 5,936 కోట్లు కేటాయించింది. విశాఖ స్టీల్ ను ఆదుకునేందుకు బడ్జెట్ కు ముందే కేంద్రం రూ. 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఈ బడ్జెట్ లో రూ. 3,295 కోట్లు కేటాయించారు. విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు, విశాఖ-చెన్నై కారిడార్ కు రూ.285 కోట్లు కేటాయించారు. విశాఖ రైల్వే జోన్ భవనాలకు శంకుస్థాపనలు చేశారు. కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధికి రూ. 5 కోట్ల నిధులు ప్రకటించారు. గత విధ్వంస పాలనతో అభివృద్ధిలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కుపోయింది. విభజనతోనే కాదు... గత ప్రభుత్వ విధ్వంసంతో కూడా ఏపీ దెబ్బతింది. సంపద దోచుకునేవాళ్లు కాదు... పంచేవాళ్లు కావాలి. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాము. 7 నెలల్లో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాము. 15 % వృద్ధి రేటు లక్ష్యంగా ముందుకెళుతున్నాము. దావోస్ పర్యటన విజయవంతమైంది. పలు అంతర్జాతీయ పరిశ్రమలు ఏపీకి రాబోతున్నాయి. ఉద్యోగ, ఉపాధి కల్పన ధ్యేయంగా అడుగులు వేస్తున్నాం. అభివృద్ధి , సంక్షేమం రెండూ సమానంగా ప్రజలకు అందిస్తున్నాము. ఏఐ, గ్రీన్ ఎనర్జీ, అగ్రికల్చర్, జీరో పావర్టీ, ఎంఎస్ఎంఈల విషయంలో కేంద్రం ఆలోచనలకు తగ్గట్టు ఏపీ అనుసరిస్తోంది. కొందరు రాజకీయ లబ్ధి కోసం బడ్జెట్లో ఏపీకి చేసిన కేటాయింపులపై విమర్శలు చేస్తున్నారు. బడ్జెట్లో ఏపీ పేరు ప్రస్తావనపై మాట్లాడుతున్నారు. కేంద్రం మన రాష్ట్రానికి నిధులు కేటాయించి ఆదుకోవడం ముఖ్యం కానీ ప్రతిసారీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్రం ఇచ్చే చేయూతతో దేశంలోనే ఏపీని నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతాం. 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నాం... అని చంద్రబాబు వివరించారు.