ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల సార్వభౌమాధికారాలను బుల్డోజర్ పెట్టి తొక్కిస్తున్నాడు. ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు వంతపాడుతున్నాడు. దేశంలో లౌకిక వాదాన్ని పరిరక్షించడానికి ఎర్ర జెండాలు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాయి. మతతత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడటానికి సీపీఎం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరాత్ అన్నారు. నెల్లూరులో మూడు రోజులుగా జరుగుతున్న సీపీఎం 27వ మహాసభలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా సాయంత్రం నగరంలోని వీఆర్సీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. నరేంద్ర మోదీ, చంద్రబాబుపై ఘాటుగా విమర్శలు సంధించారు.
ఆర్థిక గణన సర్వే ప్రకారం గత ఐదేళ్ల మోదీ పాలనలో దేశం 40 సంవత్సరాలు వెనుకబడిపోయిందని అన్నారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందనీ, రాష్ట్ర కేటాయింపుల్లో రూ.1.10 లక్షల కోట్ల కోత పడిందని కరాత్ అన్నారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణమని అన్నారు. ఆ రోజు చంద్రబాబు వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి అంగీకరించాడన్నారు. కృష్ణపట్నం పోర్టు నుంచి కంటైనర్ టెర్మినల్‌ను అదానీ తరిలించినా చంద్రబాబు దాని గురించి నోరు మెదపడం లేదన్నారు. కంటైనర్ టెర్మినల్ మూసివేయడంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడినా చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు.