అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. స్వగ్రామం తాడిపత్రికి వచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏర్పాట్లు చేసుకోగా.. అందుకు పోలీసులు అనుమతించని పరిస్థితి. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందంటూ యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో కేతిరెడ్డిని గృహనిర్బంధం చేస్తూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ... ‘‘తాడిపత్రిలో నా ఇంటికి పోలీసులు నన్ను వెళ్ళనివ్వడం లేదు. వేరే దేశానికి వెళ్లాలంటే వీసా కావాలి. తాడిపత్రి కి వెళ్ళాలంటే వీసా ఏమైనా తీసుకోవాలా. పోలీసులు వీసా ఆఫీస్ చెప్పితే అక్కడికి వెళ్లి అప్లై చేసుకుంటా’’ అంటూ ఎద్దేవా చేశారు.తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వసూళ్ళకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
పట్టణంలో చిన్న బండి కొట్టు నుంచి షాపింగ్ కాంప్లెక్స్ వరకు వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. ఏమైనా అంటే అభివృద్ధి కోసం అంటారని.. ప్రభుత్వ నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తే తాను కూడా సహకరిస్తానన్నారు. తాను తాడపత్రికి వెళ్తే లాండర్ ప్రాబ్లం వస్తుందని అంటున్నారని.. ఏవిధంగా వస్తుందో పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు.తాడిపత్రిలో పోలీస్ వ్యవస్థ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పని చేస్తుందని వ్యాఖ్యలు చేశారు. పట్టణంలో అమాయకులను బెదిరింపులకు గురి చేసి, వారిపై దాడులు చేస్తూ ఒక భయానక వాతావరణం జేసీ ప్రభాకరరెడ్డి సృష్టిస్తున్నారని తెలిపారు. ఊరిలో గ్రామ దేవతకు దున్నపోతులను వదిలినట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి కొంతమందిని వదిలి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘వాళ్లు రెచ్చగొడితే నేను రెచ్చిపోను. నేను ఏ రోజైనా తాడపత్రిలో నా ఇంటికి వెళ్ళే తీరుతా’’ అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు.