కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల వారికి మేలుచేసేలా ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజలకు వికసిత భారత్ ఫలాలు అందేలా ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు కూడా విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. వైసీపీ పాలనలో కేంద్ర పధకాలకు స్టిక్కర్లు వేసుకున్నారని వ్యాఖ్యలు చేశారు.
గత ఐదేళ్లల్లో అద్భుతమైన పాలన అన్న వారు.. ఇప్పుడు తప్పు పడుతున్నారని తెలిపారు.మహిళలు, రైతులు, శ్రామికులకు ఆసరా ఇచ్చే బడ్జెట్ ఇది అని.. లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా ఆలోచన చేశారన్నారు. 12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్ను లేకుండా చేశారన్నారు. మహిళలకు 4 లక్షల కోట్లు ప్రత్యేకంగా బడ్జెట్‌లో కేటాయించారని.. ఏపీకి సంబంధించి పోలవరం, రాజధాని నిర్మాణం కోసం నిధులు కేటాయించారని అన్నారు. పోలవరం మొదటి దశ పనులకు దాదాపు 35 వేల కోట్లు ఇచ్చిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసేలా కూటమి ప్రభుత్వం పాలన చేస్తోందన్నారు. పి అనే పదం పలకడం చేతకాని వైసీపీ నేతలు బడ్జెట్ గురించి నీతులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లల్లో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని.. అందుకే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసి ఇంట్లో కూర్చో పెట్టారని విమర్శలు గుప్పించారు. అమరావతి భ్రమరావతి అని కుట్రలు చేసి రాజధానిని నాశనం చేశారన్నారు. మీరెన్ని కుట్రలు చేసినా ప్రజలు కూటమి పక్షాన ఉన్నారన్నారు.