మూడు రోజులుగా నెల్లూరులో జరుగుతున్న సీపీఎం 27వ రాష్ట్ర మహాసభలు సోమవారం ముగిశాయి. చివరి రోజు జరిగిన రాష్ట్ర ప్రతినిధుల సభలో పాల్గొన్న 510 మంది ప్రతినిధులు రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వీ శ్రీనివాసరావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యదర్శివర్గంలోని 15 మందిలో 13 మంది పాతవారే. వీరిలో శ్రీనివాసరావుతోపాటు వై.వెంకటేశ్వర్లు, సీహెచ్.బాబూరావు, కె.ప్రభాకరరెడ్డి, డి.రమాదేవి, బి.తులసీదాస్, వి.వెంకటేశ్వర్లు, కే.లోకనాథం, కిల్లో సురేంద్ర, కె.సుబ్బరామమ్మ, ఏవీ.నాగేశ్వరరావు, మూలం రమేశ్, వి.రాంగోపాల్, వి.ఉమామహేశ్వరరావు, బి.బలరాం ఉన్నారు. ఈ కమిటీ మూడేళ్లపాటు కొనసాగుతుంది. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ, ‘ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తాం. నేడు దేశంలోనూ, రాష్ట్రంలోనూ మతతత్వ శక్తులు పెట్రేగి పోతున్నాయి. ప్రజలపై దాడులు చేస్తున్నాయి. ప్రస్తుతం కార్పొరేట్ శక్తులు కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయి. అలాగే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వాలు బలవంతంగా రుద్దుతున్నాయి. ఈ చర్యలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఎం తరఫున పార్టీలోని విద్యావంతులు పోటీలో ఉన్నారు. వారి గెలుపునకు అందరూ కృషి చేయాలి’ అని అన్నారు.