పుస్తకాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న విద్యార్థులు ఉల్లాసంగా గడిపారు. పుస్తకాల సంచులు మోస్తూ బండెడు కష్టాన్ని భరించిన వారు ఉపశమనం పొందారు. హోంవర్క్, ప్రాజెక్టు పనులతో అలసిన వారు సేద తీరారు. పాఠశాల వార్షికోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తమలో దాగి ఉన్న ప్రతిభను చూపి ఔరా అనిపించారు. చేవెళ్ల మున్సిపల్ పరిధిలో ఉన్న వివేకానంద ప్రైవేట్ పాఠశాలలో రెండో వార్షికోత్సవం ఆ పాఠశాల చైర్మన్ కొరదాల నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత, గౌరవ అతిథులుగా స్థానిక చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్, ఎంఈఓ పురన్ దాస్ లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అంతకుముందు పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాబ్ ను వెంకటేష్ నేత రిబ్బన్ కట్ చేసి ఓపెనింగ్ చేశారు. అనంతరం వారు విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. క్రమశిక్షణతో విద్యను అభ్యసించి మంచి విజయాలు సాధించాలని, విద్యార్థులు బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. సినిమా పాటలకు విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ లావణ్య, డైరెక్టర్ హన్మంతరావు, డీన్ మోనిక వెంకట్, ప్రిన్సిపాల్ అర్చన రాజ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ వేణు కుమార్, మేనేజర్ ఆర్ నరేష్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
![]() |
![]() |