ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాంసంగ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల

Technology |  Suryaa Desk  | Published : Thu, Feb 27, 2025, 02:38 PM

ఇప్పటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు అత్యవసర గ్యాడ్జెట్‌లుగా మారిపోయాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నకొద్దీ, వినియోగదారుల అవసరాలు కూడా పెరుగుతున్నాయి.అయితే, అత్యధిక ఫీచర్లను అందించే ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు అందరికీ అందుబాటులో ఉండవు. ఈ నేపథ్యంలో బడ్జెట్, ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్ లో ప్రాధాన్యతను పెంచుకున్నాయి. పెద్ద డిస్‌ప్లే, మెరుగైన ప్రాసెసర్, శక్తివంతమైన బ్యాటరీ, మంచి కెమెరా వంటి లక్షణాలను తక్కువ ధరలోనే అందించేందుకు మొబైల్ తయారీ సంస్థలు పోటీపడుతున్నాయి. భారత మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో ప్రముఖ బ్రాండ్‌లలో ఒకటైన శాంసంగ్ ఈ విభాగంలో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతోందివీటిని దృష్టిలో ఉంచుకొని ఇదివరకే శాంసంగ్ గెలాక్సీ F06 5G, గెలాక్సీ A06 5G వంటి బడ్జెట్ రేంజ్ ఫోన్‌లను విడుదల చేసింది. వీటికి తోడుగా నేడు గెలాక్సీ M16 5G, గెలాక్సీ M06 5G మోడళ్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో ప్రత్యేకంగా, గెలాక్సీ M16 5G మోడల్ ఆకట్టుకునే డిజైన్, శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లు, సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఇక గెలాక్సీ M16 5G స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే..
శాంసంగ్ గెలాక్సీ M16 5G స్మార్ట్‌ఫోన్ 7.9mm సూపర్‌ స్లీక్ డిజైన్‌ను కలిగి ఉండి, 6.7 అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండటంతో స్క్రోల్ చేస్తే స్మూత్ అనుభూతిని అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7.0 ఉంది. అంతేకాదు, 6 సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, సెక్యూరిటీ అప్‌డేట్‌లు లభిస్తాయి. అంటే, దీర్ఘకాలం పాటు ఈ ఫోన్ లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌ను పొందే అవకాశం ఉంటుంది.


ఇక హ్యాండ్‌సెట్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్ లు ఉండగా.. వీటితో పాటు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP ఫ్రంట్ కెమెరా అందించబడింది. ఇక 5000mAh శక్తివంతమైన బ్యాటరీ ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G, బ్లూటూత్ 5.3, డ్యూయల్ బ్యాండ్ వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్ట్ వంటి అధునాతన కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ అందించబడింది. అలాగే, IP54 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ లక్షణం కలిగి ఉంది.ఇక ధర, లభ్యత విషయానికి వస్తే.. గెలాక్సీ M16 5G మోడల్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ. 11,499గా నిర్ణయించబడింది. ఈ ఫోన్ అమ్మకాలు మార్చి 5న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్నాయి. శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ వంటి ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మొబైల్ ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మింట్ గ్రీన్, బ్లష్ పింక్, థండర్ బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి రానుంది. శాంసంగ్ గెలాక్సీ M16 5G బడ్జెట్ రేంజ్‌లో ప్రీమియం లుక్, శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లు, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు అందించడం విశేషం. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్‌లు కోరుకునే వినియోగదారులకు ఇది ఒక మంచి ఎంపికగా నిలవనుంది. ఇక శాంసంగ్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌తో 2025 సంవత్సరంలో బడ్జెట్ మార్కెట్లో మరింత ప్రాబల్యం సాధించబోతుందని చెప్పొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com