సినీ నటుడు పోసాని కృష్ణమురళికి రిలీఫ్ లభించింది. నరసరావుపేట జిల్లా కోర్టు పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసింది. పది వేల రూపాయల చొప్పున రెండు పూచీకత్తులపై పోసాని కృష్ణ మురళికి నరసరావుపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యా్ణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసాని కృష్ణ మురళిపై గతేడాది నవంబర్‌లో పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేసు నమోదైంది. టీడీపీ నేత కిరణ్ ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణ మురళిపై నరసరావుపేట టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పీటీ వారెంట్ జారీ చేసిన పోలీసులు.. ఇటీవల పోసానిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం నరసరావుపేట కోర్టులో పోసాని కృష్ణ మురళిని హాజరుపరచగా.. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
మరోవైపు పోసాని కృష్ణ మురళిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌ను కర్నూల్ కోర్టు కొట్టివేసింది. పోసాని కస్టడీకి అప్పగించాలంటూ ఆదోని పోలీసులు మార్చి ఆరో తేదీన కర్నూలు జేఎఫ్‌సీఎం కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. పోసానిని విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన కర్నూలు కోర్టు.. నవంబర్ ఏడో తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తీర్పు ఇచ్చింది. అలాగే బెయిల్ పిటిషన్ మీద తీర్పును రిజర్వ్ చేసింది.
మరోవైపు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోసాని కృష్ణ మురళికి ఇప్పటికే బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. కడప మొబైల్ కోర్టు ఇటీవల పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసింది. పోసాని కృష్ణ మురళిని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్ కొట్టివేసిన కడప మొబైల్ కోర్టు.. పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు ఓబులవారిపల్లె పోలీసులు కేసు నమోదుచేసి. ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్‌లో పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రాజంపేట సబ్ జైలుకు తరలించారు. వేర్వేరు చోట్ల కేసులు నమోదు కావటంతో అక్కడి నుంచి ఆయన వివిధ జైళ్లు మారుతున్నారు. మరోవైపు పోసాని కృష్ణ మురళిపై ఏపీవ్యాప్తంగా 17 వరకూ కేసులు నమోదయ్యాయి. అలాగే తనపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ పోసాని కృష్ణ మురళి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది.
![]() |
![]() |