పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు కొన్ని రోజులుగా ఏమీ కలిసిరావడం లేదు. టీ20 ప్రపంచకప్ 2024తో పాటు స్వదేశంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనూ ఆ జట్టు దారుణ ప్రదర్శన చేసింది. రెండింట్లోనూ లీగ్ దశ నుంచే నిష్క్రమించింది. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే.. కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఆ జట్టు బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా విఫలం అవడంతో ఆ జట్టు దారుణ ఫలితాలను ఎదుర్కొంటోంది.
తమ పదునైన పేస్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించిన పాక్ పేసర్లు.. ఇప్పుడు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు వచ్చిన పాక్.. ఇక్కడ కూడా పేలవ ప్రదర్శన చేస్తోంది. తొలి టీ20 మ్యాచులో చిత్తుగా ఓడిపోయిన ఆ జట్టు.. రెండో టీ20లోనూ పరాజయం పాలైంది. దీంతో రెండు మ్యాచుల్లోనూ ఓడి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోయింది.
ఇక మంగళవారం రెండో టీ20 మ్యాచ్ జరిగింది. అయితే వర్షం కారణంగా మ్యాచును 15 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. 9 వికెట్ల నష్టానికి 135 రన్స్ స్కోరు చేసింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ సల్మాన్ అఘా 28 బంతుల్లో 46 రన్స్ స్కోరు చేశాడు. షాదాబ్ ఖాన్ 14 బంతుల్లో 26 రన్స్, షాహీన్ అఫ్రిదీ 14 బంతుల్లో 22 రన్స్ స్కోరు చేశారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ తొలి ఓవర్‌లో ఒక్క పరుగూ కూడా స్కోరు చేయలేకపోయింది. షాహీన్ అఫ్రిదీ వేసిన ఈ ఓవర్‌లో కివీస్ ఓపెనర్ టిస్ సీఫర్ట్ ఒక్క పరుగు కూడా స్కోరు చేయలేదు. అయితే ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో షాహీన్‌ను మరోసారి ఎదుర్కొన్న సీఫెర్ట్.. అతడికి చుక్కలు చూపించాడు. మెయిడిన్ ఓవర్‌ను కవర్ చేసేలా బాదేశాడు. ఈ ఓవర్‌లో తొలి రెండు బంతులను స్టాండ్స్‌లోకి పంపిన సీఫెర్ట్.. చివరి రెండు బంతలకు కూడా అదే శిక్ష వేశాడు. దీంతో ఈ ఓవర్‌లో మొత్తంగా 26 రన్స్ వచ్చాయి. మిగతా బ్యాటర్లు కూడా రాణించడంతో న్యూజిలాడ్ 13.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి.. సిరీస్‌ను కైవసం చేసుకుంది.
![]() |
![]() |