ప్రముఖ మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ శిక్షకులు, సీనియర్ నటుడు షిహాన్ హుసైని (60) బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మరణ వార్తపై సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. ఇక ఆయన ఆధ్వర్యంలోనే హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కరాటేని నేర్చుకున్నారు. తన గురువు మరణించడంతో పవన్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు."ప్రముఖ మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ శిక్షకులు షిహాన్ హుసైని గారు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. నేను ఆయన వద్దే కరాటే శిక్షణ పొందాను. మార్షల్ ఆర్ట్స్ గురు హుసైని గారు అనారోగ్యంతో బాధపడుతున్నారని నాలుగు రోజుల కిందటే తెలిసింది. వారి ఆరోగ్యం గురించి చెన్నైలోని నా మిత్రుల ద్వారా వాకబు చేసి, విదేశాలకు పంపించి మెరుగైన వైద్యం చేయించాల్సి ఉంటే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తానని తెలిపాను. అలాగే ఈ నెల 29వ తేదీన చెన్నై వెళ్లి హుసైని గారిని పరామర్శించాలని నిర్ణయించుకొన్నాను. ఇంతలో దుర్వార్త వినాల్సి రావడం అత్యంత బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు.
![]() |
![]() |