తీహార్ జైలుకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ శివారులో మరింత విశాలంగా మరో జైలును నిర్మిస్తామని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అధికారికంగా ప్రకటన చేశారు. జైలు సర్వేకి రూ. 10 కోట్లు మంజూరు చేసినట్టు ఆమె తెలిపారు. ఖైదీలతో తీహార్ జైలు కిక్కిరిసిపోవడం, జైలు చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని పశ్చిమ జనక్ పురి ప్రాంతంలో 400 ఎకరాల విస్తీర్ణంలో 1958లో తీహార్ జైలును నిర్మించారు. 10,026 మంది ఖైదీలు పట్టేలా ఈ జైలును నిర్మించడం జరిగింది. ప్రస్తుతం జైల్లో దాదాపు 19,500 మంది ఖైదీలు ఉన్నట్టు సమాచారం. ఈ రద్దీని తగ్గించేందుకు మండోలీ జైలు సముదాయాన్ని ఢిల్లీ ప్రభుత్వం నిర్మించింది. బాప్రోలా, నరేలా ప్రాంతాల్లో కొత్త జైళ్లను నిర్మించే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. తాజాగా, తీహార్ జైలునే మరో ప్రాంతానికి తరలించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమయింది.
![]() |
![]() |