ఫైవ్ స్టార్ హోటల్ సిబ్బందిని బురిడీ కొట్టించాలని ప్రయత్నించిన ఓ యూట్యూబర్ చివరకు తానే ఫూల్ అయ్యింది. ఉచితంగా టిఫిన్ చేద్దామని వెళ్లి రూ.3,600 బిల్లు చెల్లించి బయటపడింది. తన జీవితంలో ఇదే అత్యంత ఖరీదైన బ్రేక్ ఫాస్ట్ అంటూ చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఢిల్లీకి చెందిన కంటెంట్ క్రియేటర్ నిషు తివారీ ఇటీవల ఓ ఫ్రాంక్ వీడియో చేసింది.చాణక్యపురి ఏరియాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో అతిథులకు ఉచితంగా సర్వ్ చేసే బ్రేక్ ఫాస్ట్ తినేసి అక్కడి స్టాఫ్ ను బురిడీ కొట్టించాలని ప్రయత్నించింది. సాధారణంగా హోటల్ లో దిగిన అతిథులు నైట్ డ్రెస్ తోనే బ్రేక్ ఫాస్ట్ చేయడానికి వస్తారు. అదేవిధంగా నిషు తివారీ కూడా నైట్ డ్రెస్ తో హోటల్ లోపలికి వెళ్లింది. బ్రేక్ ఫాస్ట్ ఏరియాలోకి వెళుతుండగా ఎంట్రెన్స్ లో హోటల్ సిబ్బంది ఆమె దిగిన రూమ్ నెంబర్ అడగగా.. ఓ గది నెంబర్ చెప్పి లోపలికి వెళ్లింది.హోటల్ సిబ్బంది ఈ వివరాలను రిజిస్టర్ లో నమోదు చేసుకున్నారు. లోపల బఫే సిస్టం కావడంతో నచ్చిన ఫుడ్ తీసుకుని కడుపునిండా తిన్నాక నిషు మెల్లగా జారుకునే ప్రయత్నం చేసింది. అయితే, ద్వారం వద్ద ఉన్న సిబ్బంది నిషును ఆపి ఆమె చెప్పిన గదిలో వేరే అతిథి ఉన్నారని, కరెక్ట్ రూమ్ నెంబర్ చెప్పాలని అడిగారు. దీంతో దొరికిపోయానని గ్రహించిన నిషు.. అసలు విషయం చెప్పేసి తాను తిన్న ఫుడ్ కు రూ.3,600 బిల్లు చెల్లించింది. హోటల్ నుంచి బయటపడ్డాక నిషు మాట్లాడుతూ.. తన జీవితంలో ఇదే అత్యంత ఖరీదైన బ్రేక్ ఫాస్ట్ అని వ్యాఖ్యానించింది.
![]() |
![]() |