ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలానికి భక్తుల తాకిడి పెరుగుతోంది. భ్రమరాంబికా మల్లిఖార్జునస్వామి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దీంతో శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. ఉగాది బ్రహ్మోత్సవాలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నరు. ఎక్కువ మంది కాలి నడకన శ్రీశైలానికి చేరుకుంటున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీశైలం దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎండాకాలం కావటంతో ఎండవేడిమి నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేందుకు పార్కులు, ఖాళీ స్థలాల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఉగాది బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల చివరి వరకూ భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని ఆలయ అధికారులు చెప్తున్నారు.
మరోవైపు మార్చి 27 నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభంకానున్నాయి. 27వ తేదీ స్వామివారి యాగశాల ప్రవేశంతో శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభమవుతాయి. నాలుగు రోజులు పాటు అంటే మార్చి 31 వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 26 నుంచి శ్రీశైలంలో స్పర్శ దర్శనాలు రద్దు చేశారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఈ ఐదు రోజులూ స్పర్శదర్శనాలు తాత్కాలికంగా నిలిపివేసిన ఆలయ అధికారులు.. అలంకరణ దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. మరోవైపు ఉగాది ఉత్సవాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా భక్తులు భారీగా శ్రీశైలం వస్తుంటారు.
ఈ నేపథ్యంలో భక్తుల కోసం బసవవనం, బాలగణేశవనం, పాతాళగంగ మార్గంలో ఉన్న శివదీక్షా శిబిరాలు, పర్వతవనం, రుద్రాక్షవనం, శివాజీవనం, మల్లమ్మకన్నీరు వంటిచోట్ల ఆలయ అధికారులు చలువపందిళ్లు వేయించారు. కాలిబాట మార్గంలోని వెంకటాపురం, దామర్లగుంట, పెద్దచెరువు, నాగలూటి, కైలాసద్వారం వద్దకూడా పాదచారుల కోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించింది శ్రీశైలం దేవస్థానం. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నపూర్ణాభవనంలో అన్న ప్రసాదం అందిస్తారు. ఉత్సవాల్లో భాగంగా భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
![]() |
![]() |