ఆంధ్రప్రదేశ్‌లో మొదటి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ నుంచి స్టేట్ ఫుడ్ ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఆ మేరకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. విశాఖపట్నంలో ఈ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఏర్పాటవుతోంది. విశాఖ ఫుడ్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చిన ఆరు నెలల తర్వాత రాష్ట్రంలో మరో మూడు చోట్ల ఆహార ప్రయోగశాలలు(ఫుడ్ ల్యాబ్స్) అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. తిరుపతి, తిరుమల, గుంటూరులోనూ రీజనల్ ఫుడ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
విశాఖపట్నం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని సుమారుగా 20 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది ఏర్పాటవుతోంది. ప్రభుత్వ ఏజెన్సీలు సేకరించే అన్ని రకాల ఆహార పదార్థాలను పరీక్షించేందుకు వీలుగా ఇక్కడ సామాగ్రి, పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు కూడా తమ ఆహార పదార్థాలను టెస్ట్ చేయించుకునే వీలుంది. అయితే దీనికి కానూ వారు కొంత మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విశాఖపట్నం ఫుడ్ ల్యాబ్ మాత్రమే కాకుండా గుంటూరు, తిరుపతిలోనూ సుమారుగా 19 కోట్ల వ్యయంతో మరో రెండు ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ల్యాబ్స్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
గుంటూరులో మెడికల్ కాలేజీ సమీపంలో 12 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫుడ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇక తిరుపతిలో 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ల్యాబ్ ఏర్పాటు కోసం చర్యలు చేపడుతున్నారు. ఈ రెండు ల్యాబ్‌లలోనూ ప్రభుత్వ ఏజెన్సీలు తీసుకువచ్చే ఆహార పదార్థాలతో పాటుగా ప్రైవేట్ పార్టీల తెచ్చే ఆహార పదార్థాల నమూనాలను కూడా పరీక్షిస్తారు. ఇక తిరుమలలో ప్రత్యేకంగా మరో ల్యాబ్ ఏర్పాటు కానుంది. టీటీడీ తయారు చేసే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించేందుకు తిరుమలలో ఫుడ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ప్రాంతీయ ఆహార ప్రయోగశాలలు ఎక్విప్‌మెంట్ ఇన్‌స్టలేషన్ కోసం ఇప్పటికే టెండర్ల ప్రక్రియ దాదాపుగా పూర్తైంది. త్వరలోనే పనులు ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు.
![]() |
![]() |