పేగు బంధానికి భారం అయిందో లేక ఎవరో చేసిన పాపానికి బలైందో తెలియదు కానీ.. తల్లి పొత్తిళ్లల్లో ఉండి అమ్మ ప్రేమను ఆస్వాదించాల్సిన ఓ చిన్నారి మాత్రం బాత్రూంలోని చెత్త బుట్టలో శవమై తేలింది. ఈ హృదయ విదారక ఘటన ముంబయిలోని ఓ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకోగా.. అక్కడ పని చేసే సిబ్బందే ఈ విషయాన్ని గుర్తించారు. ఆపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ చిన్నారిని అక్కడ ఎవరు వదిలి పెట్టి ఉంటారో తెలుసుకునేందు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరంలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఎవరో తెలియదు కానీ.. అప్పుడే పుట్టిన నవజాత శిశువును టెర్మినల్ 2 బాత్రూంలోని చెత్త బుట్టలో పడవేసి వెళ్లిపోయారు. అయితే బాత్రూంలు శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బందికి.. చెత్త బుట్టలో చిన్నారి కనిపించింది. దీంతో భయపడిపోయిన వాళ్లు.. బిడ్డ బతికుందేమోనని చూశారు. కానీ ఎలాంటి చలనమూ లేకపోవడంతో చనిపోయిందని భావించి వెంటనే పైఅధికారులు, పోలీసులుకు తెలిపారు.
హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ దారుణానికి ఎవరు పాల్పడారనే విషయం తెలుసుకోవడానికి ముంబయి పోలీసులు.. విమానాశ్రయంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. చిన్నారిని కావాలనే ఎవరైనా హత్య చేసి ఉంటారా, లేక చినిపోయిందనే ఇక్కడ పడేసి వెళ్లిపోయుంటారా, పడేసి వెళ్లిపోయాకే బిడ్డ చనిపోయిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఏది ఏమైనా అప్పుడే పుట్టిన బిడ్డను బాత్రూంలోని చెత్త బుట్టలో పడేసి వెళ్లడాన్ని ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ఆ దృశ్యాలను చూసిన ప్రయాణికులు, సిబ్బంది అయితే విపరీతంగా భయపడి పోతున్నారు. పదే పదే ఆ చిన్నారి ముఖమే గుర్తుకు వస్తుందంటూ వివరిస్తున్నారు. బిడ్డను ఉంచుకోవాలని లేకపోతే.. ఎవరికైనా ఇచ్చేయొచ్చు కదా అంటూ చెప్పుకొస్తున్నారు. మరి దీనిపై మీకేమనిపిస్తుందో కామెంట్ల రూపంలో వెల్లడించేయండి.
![]() |
![]() |