ప్రముఖ నటుడు మోహన్‌లాల్.. తన స్నేహితుడు మమ్ముట్టి కోసం శబరిమలలో ప్రత్యేకంగా పూజలు చేయడం దుమారం రేగుతోంది. ముస్లిం అయిన మమ్ముట్టి పేరుతో ఆలయంలో ఎలా పూజలు చేయించారని మోహన్‌లాల్‌పై పలువురు విమర్శలు చేస్తున్నారు. ఒకవేళ మమ్ముట్టి కోరిక మేరకే ఈ పూజలు జరిగి ఉంటే, ఆయన క్షమాపణ చెప్పాలని మరి కొందరు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా, ఈ వివాదంపై మోహన్‌లాల్ స్పందించారు. ప్రార్థనలు వ్యక్తిగతమని, మమ్ముట్టి ఆరోగ్యం గురించి వార్తలు రావడంతోనే తాను పూజలు చేశానని వివరణ ఇచ్చారు.
కాగా, మార్చి 18న ‘L2:Empuraan’ సినిమా ప్రమోషన్లలో భాగంగా శబరిమలకు వెళ్లిన మోహన్‌లాల్.. అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. ‘ఉషా పూజ’ సమయంలో మమ్ముట్టి పేరున పూజలు చేయించారు. ‘ముహమ్మద్ కుట్టి’, జన్మ నక్షత్రం ‘విశాఖ’ అని రాసి ఉన్న చీటీని పూజారికి ఇచ్చారు. దీనికి సంబంధించిన రసీదు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కొందరు దీనిని ప్రశంసిస్తే.. మరికొందరు విమర్శిస్తున్నారు.
మలయాళ పత్రిక 'మాధ్యమం' మాజీ సంపాదకుడు అబ్దుల్లా.. మమ్ముట్టి కోరిక మేరకే మోహన్‌లాల్ పూజలు చేయించి ఉంటే, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇస్లామిక్ చట్టాల ప్రకారం అల్లాహ్‌ను మాత్రమే ప్రార్థించాలని ఆయన అన్నారు. మోహన్‌లాల్, మమ్ముట్టి మధ్య వృత్తిపరమైన పోటీ ఉన్నప్పటికీ వారిద్దరూ మంచి స్నేహితులు. ఈ వివాదం గురించి మోహన్‌లాల్ మాట్లాడుతూ.. ఆయన తనకు సోదరుడితో సమానమని, ఆయన కోసం ప్రార్థించడంలో తప్పేముందని మమ్ముట్టి స్వల్ప అనారోగ్యానికి గురయ్యారనే వార్త తెలిసిన తర్వాతే తాను ప్రార్థనలు చేశానని మోహన్‌లాల్ తెలిపారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న రసీదు గురించి ప్రశ్నించగా.. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారి ఎవరో బయటపెట్టి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఈ ఆరోపణలు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఖండించింది. మోహన్‌లాల్ ప్రకటన అపార్థాలకు దారితీసిందని, తమ సిబ్బంది తప్పు లేదని స్పష్టం చేసింది. భక్తులకు ఇచ్చిన రసీదు మాత్రమే లీక్ అయిందని, తమవైపు నుంచి ఎలాంటి పొరపాటు జరగలేదని బోర్డు తెలిపింది.
మరోవైపు, మమ్ముట్టి కేన్సర్ బారినపడ్డారనే పుకార్లు కూడా వ్యాపించాయి. కానీ, ఆయన టీం ఇది "ఫేక్ న్యూస్" అని కొట్టిపారేసింది. రంజాన్ సందర్భంగా విరామం తీసుకున్నారని, ఆయన ఉపవాసం చేస్తున్నారని, షూటింగ్ షెడ్యూల్‌ను కూడా వాయిదా వేశారని ఆయన బృందం వివరణ ఇచ్చింది.
![]() |
![]() |