ఓ 11 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచాయత్నం కేసులో తీర్పునిస్తూ అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ఆయన కేసు గురించి మాట్లాడుతూ... స్త్రీల వక్షోజాలను పట్టుకోవడం, వారు వేసుకున్న ప్యాంటు నాడాలు విప్పడం వంటివి చేస్తే అత్యాచారయత్నం కిందకు రాదని వివరించారు. దీనిపై తీవ్ర విమర్శలు రాగా.. సుప్రీం కోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించింది. బుధవారం రోజు విచారణ జరిపి.. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవి ఏమాత్రం సున్నితమైనవి కావంటూనే.. అమానవీయంగా ఉన్నాయని వివరించింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
2021వ సంవత్సరం ఉత్తర ప్రదేశ్‌లోని కాస్‌గంజ్ ప్రాంతానికి చెందిన 11 ఏళ్ల మైనర్ బాలిక తన తల్లితో కలిసి నడుస్తూ రోడ్డుపై వెళ్తుండగా.. చిన్నారిని ఇంటి వద్ద దింపుతామంటూ పవన్, ఆకాష్ అనే ఇద్దరు యువకులు ఆమెను బండి ఎక్కించుకున్నారు. అయితే మార్గమధ్యంలో బండి ఆపి బాలికపై అత్యాచారయత్నం చేశారు. ముఖ్యంగా చిన్నారి వక్షోజాలు పట్టుకుని కల్వర్టు కిందకు లాగే ప్రయత్నం చేశారు. అలాగే ఆమె ప్యాంటు నాడాలు కట్ చేసి ప్యాంటు విప్పబోయారు. కానీ అప్పటికో రోడ్డుపై వెళ్తున్న కొందరు ప్రయాణికులు ఆగి దీన్ని ఆపారు. ఆపై నిందితులను పోలీసులకు అప్పగించారు.
ఆకాష్, పవన్‌లపై అత్యాచారయత్నం కింద కేసు నమోదు చేసి ట్రయల్ కోర్టులో హాజరు పరిచారు. దీంతో న్యాయస్థానం ఆకాష్, పవన్‌లకు సమన్లు జారీ చేసింది. దీంతో నిందితులు బెయిల్ ఇవ్వాలంటూ అలహాబాద్ హైకోర్టుకు వెళ్లగా.. విచారణ చేపట్టిన ధర్మాసనం షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా.. అత్యాచారం అభియోగాలను తీసేసి వస్త్రాలను తొలగించే ఉద్దేశంతో నేరపూరిత బలప్రయోగానికి పాల్పడ్డట్లుగా మార్చారు.
బాలికపై అత్యాచార యత్నం చేయాలని ప్రయత్నించడానికి, నేరం చేయడానికి వ్యత్యాసం ఉంటుందంటూ.. వక్షోజాలను పట్టుకోవడం, ప్యాంటు నాడాలు విప్పడం వంటివి అత్యాచారం కిందరు రావని.. నిందితులకు బెయిల్ మంజూరు చేశారు. జస్టిస్ మిశ్రా ఇచ్చిన ఈ తీర్పు, చేసిన కామెంట్ల బయటకు రాగా.. దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. అనేక మంది ఈ తీర్పును ఖండించారు. ఈక్రమంలోనే సుప్రీం కోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించిన బుధవారం విచారణ జరిపింది.
జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సున్నితమైనవి కావని, అమానవీయంగా ఉన్నాయని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. జస్టిస్ మిశ్రా ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. అలాగే ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రం, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
![]() |
![]() |