సమాజం డిజిటల్ వైపు వేగంగా మారుతున్న తరుణంలో సైబర్ నేరాలు ముప్పు కూడా పెరుగుతుంది. సైబర్ మోసాలకు ఎంతో మంది బలైపోతున్న ఘటనలు రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఓ వృద్ధ దంపతులు సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి రూ.50 లక్షలు పోగొట్టుకున్నారు. ఇంకా డబ్బు పంపాలని వేధింపులకు పాల్పడటంతో ఆ దంపతులు రెండు పేజీల సూసైడ్ నోట్ రాసి.. ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఖానాపుర మండలంలోని బీడి గ్రామంలో రైల్వే విశ్రాంత ఉద్యోగి డియాగో సంతన్ నజరత్ (83), ఆయన భార్య ఫావియా (79) నివాసం ఉంటున్నారు.
మార్చి 26న డియాగో గొంతుకోసి ఆత్మహత్య చేసుకోగా.. ఆయన భార్య ఫావియా విషం తాగి చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు ముందు రెండు పేజీల లేఖ రాసిన ఈ దంపతులు.. తమ చావుకు సుమిత్ బిర్రా, అనిల్ యాదవ్ అనే ఇద్దరు వ్యక్తుల కారణమని తెలిపారు. తన పేరు సుమిత్ బిర్రా అని, తాను ఢిల్లీలో టెలికమ్ అధికారిగా పనిచేస్తున్నట్టు ఫోన్ చేసి ‘మీ ఐడీకార్డుతో సిమ్ కార్డు కొన్నారని, దానిని వేధింపులు, చట్టవిరుద్ధమైన ప్రకటనలకు ఉపయోగిస్తున్నారని బిర్రా చెప్పారు.. ఆ తరువాత ఆ కాల్‌ను క్రైమ్ బ్రాంచ్ అధికారి అని చెప్పుకునే అనిల్ యాదవ్‌కు బదిలీ చేశాడు... సైబర్ నేరాలకు పాల్పడ్డారు. ఈ కేసులో మిమ్మల్ని విచారించాలి... మీ ఆస్తులు, ఆర్దిక విషయాలు వివరాలను చెప్పాలని.. లేకుంటే సిమ్ కార్డు దుర్వినియోగానికి పాల్పడినట్టు నేరం రుజువైతే అరెస్టు చేయవలసి ఉంటుంది అని బెదిరించారు..
ఈ బెదిరింపులకు భయపడి నిందితులకు రూ.50 లక్షల వరకు బదిలీ చేశారని పోలీసులు చెప్పారు. ఇంకా కావాలని ఒత్తిడి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. నిందితులకు డబ్బులు ఇవ్వడానికి గతేడాది జూన్ 4న బంగారం తాకట్టుపెట్టి.. రూ.7.15 లక్షలు తీసుకున్నట్టు సూసైడ్ నోట్‌లో తెలిపారు. ‘నా వయసు 82.. నా భార్యకు 79 ఏల్లు.. మాకు పిల్లలు లేరు.. ఈ వయసులో చూసుకునేవారు ఎవరూ లేరు.. ఎవరి దయదాక్షిణ్యాలపై ఆధారపడి మేము బతకాలని అనుకోవడం లేదు.. కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని వారు రాసిన సూసైడ్ నోట్ కంటతడి పెట్టిస్తోంది.
అంతేకాదు, తమ మృతదేహాలను విద్యార్థుల పరిశోధనల కోసం మెడికల్ కాలేజీకి అప్పగించాలని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. ఘటనా స్థలిలో డియాగో మొబైల్ ఫోన్, ఆత్మహత్యకు అతడు వాడిన కత్తి, సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. డెత్ నోట్ ఆధారంగా ప్రాథమిక విచారణ చేపట్టామని, సైబర్ మోసానికి పాల్పడిన ఇద్దరు నిందితుల పేరున కేసు రిజిస్టర్ చేశామని బెళగావి ఎస్పీ భీమశంకర్ గులేడ్ చెప్పారు.
![]() |
![]() |