భవనాలపైన రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ లను ఏర్పాటు చేయడం సాధారణంగా చూస్తుంటాం. అద్దాలతో నిర్మించే ఈ పూల్ అచ్చంగా గాలిలో ఉన్నట్లే కనిపిస్తుంది. పూల్ లో ఈత కొడుతూ నగర అందాలను చూస్తూ ప్రజలు సేదదీరుతుంటారు. అయితే, బ్యాంకాక్ లోని ఓ హోటల్ లో ఉన్న రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ లో శుక్రవారం సేదదీరుతున్న ఓ జంటకు మాత్రం భయానక అనుభవం ఎదురైంది. వారు స్విమ్మింగ్ పూల్ లో ఉన్న సమయంలోనే భూకంపం సంభవించడంతో హోటల్ బిల్డింగ్ ఊగిపోయింది. దీంతో స్విమ్మింగ్ పూల్ లోని నీరు ఒలికి పోయింది.జలపాతంలా కిందకు పడింది. స్విమ్మింగ్ పూల్ లో సునామీ వచ్చినట్లు పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉన్నట్టుండి బిల్డింగ్ ఊగిపోవడంతో స్విమ్మింగ్ పూల్ అద్దాలు పగిలిపోతాయోనని ఆ జంట భయాందోళనకు గురైంది. వెంటనే వారు స్విమ్మింగ్ పూల్ నుంచి బయటపడటంతో ప్రమాదం తప్పింది. ఆ తర్వాత కొద్ది క్షణాలకే వారు పడుకున్న మ్యాట్ నీటితో పాటు కింద పడిపోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.
![]() |
![]() |