ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు మెరుగైన ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కూలీలకు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పని కల్పించాలని భావిస్తోంది. వేసవి ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇందులో ఐదు అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇటీవల అమరావతిలో రెండ్రోజుల పాటు కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు జిల్లా యంత్రాంగం గ్రామాల్లో ఏయే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఏమేర నిధులు అవసరమో ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.చాలామంది ఉపాధి కూలీలకు కూలి గిట్టుబాటు కావడం లేదు. దీంతో నిరాశతో ఉన్న కొంతమంది కూలీలు పనులకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో వేసవిలో రోజూ కనీస సగటు వేతనం రూ.300 దక్కేలా అధికారులు పనులు చూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం నాలుగు గంటలు పని చేస్తే కూలి గిట్టుబాటయ్యేలా బృందానికి కొలతలతో మార్కింగ్ ఇస్తారు. ప్రతి శుక్రవారం రోజ్‌గార్ దివస్ సందర్భంగా పనుల మార్కింగ్, వేతనాలపై కూలీలకు అవగాహన కల్పిస్తారు.ప్రతి గ్రామంలో పశువులకు నీటితొట్టెలను పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడెక్కడ నీటితొట్టెలు నిర్మించాలో అధికారులు నిర్ణయించాక పనులు ప్రారంభిస్తారు. పశువులు, మేకలు, గొర్రెలు తిరిగే మార్గంలో బోరు, పంచాయతీ కుళాయిలు ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చి నిర్మాణ పనులు చేపడతారు. ఏప్రిల్ నెలాఖరుకు నీటితొట్టెల నిర్మాణం పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలందాయి.
![]() |
![]() |