పశ్చిమ బెంగాల్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని పథార్ ప్రతిమా గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పేలుడు సంభవించిన ఇంటిని కొందరు బాణసంచా తయారీ కేంద్రంగా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో గత రాత్రి భారీ శబ్దంతో ఇంట్లో పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.పేలుడు సంభవించిన సమయంలో ఇంట్లో 11 మంది ఉన్నారు. వీరిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన నలుగురి ఆచూకీ గల్లంతైంది. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. సిలిండర్ పేలుడు కారణంగా మంటలు వ్యాపించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![]() |
![]() |