ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ బన్వారిలాల్ వద్దకు ఓ దొంగతనం కేసు వచ్చింది. ముఖ్యంగా ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉండగా.. నిందితుడు విచారణకు హాజరు కాలేదు. దీంతో న్యాయస్థానం నిందితుడు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేస్తూ ఓ ఉత్తర్వు ఇచ్చింది. అయితే ఇందులో నిందితుడి పేరుకు బదులుగా ఎస్సై బన్వారిలాల్ జడ్జి నగ్మాఖాన్ పేరును రాసుకున్నారు. ఆపై నోటీసులు అందించాల్సిన ఇంటికి వెళ్లి నగ్మా ఖాన్ ఉన్నారా అని ప్రశ్నించగా.. వారు ఆ పేరుతో ఎవరూ లేరని చెప్పారు. దీంతో స్థానికంగా ఉండే అనేక ఇళ్లకు వెళ్లి పోలీసులు వెతికారు. కానీ లాభం లేకపోయింది. దీంతో వెనక్కి వచ్చేశారు.
అయితే తాజాగా ఈ కేసు మరోసారి విచారణ సాగగా న్యాయమూర్తి నగ్మాఖాన్.. నిందితుడిని ప్రవేశ పెట్టాలని కోరారు. కానీ అతడు రాలేడంటూ ఎస్సై బన్వారిలాల్ కోర్టుకు నివేదించారు. ముఖ్యంగా నిందితురాలు నగ్మాఖాన్ ఇంటికెళ్తే అక్కడ కనిపించలేరని.. న్యాయమూర్తి నగ్మాఖాన్‌కే చెప్పారు. తదుపరి ఉత్తర్వులు ఇవ్వాలని కూడా కోరారు. కానీ ఈ విషయం విన్న జడ్జి షాక్ అయ్యారు. మరోసారి కేసు ఫైల్‌ను తిరగేసి దొంగ పేరు వేరుగా ఉండడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కోర్టు ఎవరికి, ఏ తరహా నోటీసులు పంపిందో పోలీసు అధికారికి తెలియకపోవడం వింతగా ఉందని వ్యాఖ్యానించారు.
ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అంటూనే.. అసలు నోటీసులు కూడా అధికారి చదవకపోవడం దారుణం అన్నారు. వాటి గురించి ఎస్సై బన్వారిలాల్‌కు కనీసం జ్ఞానం కూడా లేదని.. కోర్టు నోటీసులు అందించే వ్యక్తులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. లేకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా బన్వారిలాల్‌పై చర్యలు తీసుకోవాలని యూపీ పోలీస్ చీఫ్‌నకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని రోజుల క్రితమే ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
![]() |
![]() |