కాలేయం మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి. ఇది ఎన్నో విధుల్ని నిర్వహిస్తుంది. అయితే, ఈ రోజుల్లో జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పొల్యూషన్ కారణంగా చాలా మంది లివర్ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో ఎక్కువ మంది ఫ్యాటీ లివర్‌తో సఫర్ అవుతున్నారు. ఫ్యాటీ లివర్ అనేది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని సూచిస్తుంది. చాలా మందిలో ముఖ్యంగా ఫస్ట్ స్టేజీలో ఫ్యాటీ లివర్ ఎలాంటి లక్షణాల్ని చూపించదు. ఇది తరుచుగా ఇతర ఆరోగ్య సమస్యల కోసం చేసే రక్త పరీక్షల్లో బయటపడుతుంది. అయితే, ఫ్యాటీ లివర్ తీవ్రం అయినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని సకాలంలో గుర్తిస్తే పెద్ద ప్రమాదం నుంచి బయటవచ్చు. రాత్రిపూట ఫ్యాటీ లివర్ కారణంగా కనిపించే లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే రాత్రి పూట ఎక్కువగా చెమటలు పడతాయని నిపుణులు అంటున్నారు. కాలేయం సాధారణంగా మురికిని, టాక్సిన్లను క్లీన్ చేస్తుంది. అయితే, ఫ్యాటీ లివర్ కారణంగా ఈ నిర్విషీకరణ ప్రక్రియలో ఆటంకాలు ఏర్పడతాయి. కాలేయం సరిగ్గా పనిచేయనప్పుడు, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సమస్య ఏర్పడుతుంది. ఈ పరిస్థితి అధిక చెమటకు కారణమవుతుంది. రాత్రి పూట ఎటువంటి కారణం లేకుండా మీకు చెమటలు పడితే నిర్లక్ష్యం చేయవద్దు.
కుడి ఎగువ పొత్తికడుపులో అసౌకర్యం లేదా నొప్పి
ఈ పరిస్థితిని ఎపిగాస్ట్రిక్ నొప్పి అంటారు. కాలేయం ఉదరం యొక్క కుడి ఎగువ భాగంలో ఉంటుంది. ఫ్యాటీ లివర్ వల్ల కాలేయం పెద్దదిగా మారినప్పుడు లేదా వాపు వచ్చినప్పుడు నొప్పి వస్తుంది. రాత్రిపూట పడుకున్నప్పుడు లేదా విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆ ప్రాంతంలో అసౌకర్యం లేదా తేలికపాటి నొప్పిని అనుభవించవచ్చు. ఈ నొప్పి అనేది స్థిరంగా ఉండవచ్చు లేదా అప్పుడప్పుడు వచ్చిపోవచ్చు. మీకు తరచుగా నొప్పి వస్తుంటే డాక్టర్‌ని సంప్రదించి తగిన వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.
అలసట, నిద్రలేమి
ఫ్యాటీ లివర్ ఉన్నవారికి తరచుగా అలసట అనేది ఒక ప్రధాన లక్షణం. ఇది పగటిపూట ఉన్నప్పటికీ, రాత్రిపూట చాలా మందికి నిద్ర సరిగ్గా పట్టకపోవడం లేదా తరచుగా మేల్కొనడం వంటి నిద్ర సమస్యలు కనిపించవచ్చు. కాలేయం సరిగ్గా పనిచేయనప్పుడు, శరీరం నుంచి విష పదార్థాలను సమర్థవంతంగా తొలగించలేదు. ఈ విష పదార్థాలు రాత్రిపూట పేరుకుపోయి, నిద్రను ప్రభావితం చేయవచ్చు. దీనివల్ల రాత్రిళ్లు ప్రశాంతమైన నిద్ర కరువవుతుంది. దీంతో అలసట, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కాళ్లు, పాదాల్లో వాపు
ఫ్యాటీ లివర్ వల్ల కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. దీంతో కాలేయ పనితీరు మందగిస్తుంది. కాలేయ పనితీరు తగ్గడం వల్ల శరీరంలో ద్రవం నిలుపుదల సంభవించవచ్చు. దీంతో కాళ్లు, పాదాల్లో వాపు కనిపిస్తుంది. ఇది సాధారణంగా పగటి పూట కనిపించవచ్చు. కానీ రాత్రిపూట, ముఖ్యంగా పడుకున్నప్పుడు లేదా ఉదయం నిద్ర లేవగానే కాళ్ళు, పాదాలలో వాపు (ఎడెమా) మరింత స్పష్టంగా కనిపించవచ్చు. ఈ లక్షణం కనపడితే వైద్యుణ్ని సంప్రదించి తగిన వైద్య పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం.
చర్మంపై దురద
ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు కొందరిలో, ముఖ్యంగా వ్యాధి ముదిరినప్పుడు, శరీరం అంతటా దురద కనిపించవచ్చు. ఈ దురద రాత్రిపూట తీవ్రంగా మారవచ్చు. దీంతో, నిద్రకు భంగం కలిగించవచ్చు. కాలేయం పిత్త లవణాలను సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోవడం వల్ల ఇది సంభవించవచ్చు. ఎటువంటి కారణం లేకుండా చర్మంపై దురద వస్తే ఇది ఫ్యాటీ లివర్ సంకేతం కావచ్చు.
తరచుగా మూత్ర విసర్జన
ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారికి రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన చేయవలసి రావచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నారు. లివర్ శరీరంలో వ్యర్థాల్ని తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే, కొవ్వు కారణంగా కాలేయం సరిగా పనిచేయదు. దీంతో లివర్ సరిగా పనిచేయక సమస్యలు ఉంటే మూత్ర ఉత్పత్తిని పెంచి రాత్రిపూట ఎక్కువగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.
ముఖ్య విషయాలు
* ఫ్యాటీ లివర్ మాత్రమే కాకుండా కొన్ని వ్యాధుల్లో కూడా ఈ లక్షణాలు కనిపించవచ్చు.
* ఫ్యాటీ లివర్ ఉంటే చాలా వరకు లక్షణాలు కనిపించవు. అందుకే దీన్ని సైలెంట్ డిసీజ్ అంటారు. అందుకే, పైన చెప్పిన లక్షణాలను గమనించినట్లయితే, వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన నిర్ధారణ, చికిత్స పొందడం చాలా ముఖ్యం.
* ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మద్యపానానికి దూరంగా ఉండటం ఫ్యాటీ లివర్‌ను నియంత్రించడంలో సాయపడతాయి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa