ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొలెస్ట్రాల్, హై బీపీ రెండింటినీ తగ్గించే వెల్లుల్లి చిట్కా

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Jun 20, 2025, 10:04 PM

ప్రస్తుత రోజుల్లో వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. బిజీ లై‌ఫ్‌స్టైల్, ఏది పడితే అది తినడం, పొల్యూషన్ కారణంగా ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుతో చాలా మంది సఫర్ అవుతున్నారు. ఈ రెండూ పెద్ద సమస్యలుగా మారాయి. ఈ రెండు కూడా గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతున్నాయి. కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో ఉండే ఒక కొవ్వు లాంటి పదార్థం. ఇది కణ త్వచాలను నిర్మించడానికి, హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి, విటమిన్ డి తయారు చేయడానికి చాలా అవసరం.


అయితే, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు అది ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్. ఇది రక్తనాళాలకు అంటుకుని.. గుండెకు హాని చేస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలకు కారణమవుతుంది. ఇక, రక్తపోటు అనేది గుండె రక్తాన్ని పంప్ చేసినప్పుడు రక్త నాళాల గోడలపై పడే ఒత్తిడి. అందుకే ఈ రెండింటిని కంట్రోల్‍‌లో ఉంచుకోవాలి. ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ శిల్పా అరోరా ఈ రెండింటిని కంట్రోల్ చేసే సూపర్ చిట్కా చెప్పారు. అదే పులియబెట్టిన వెల్లుల్లి చిట్కా. ఇది ఎలా పనిచేస్తుంది, ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


వెల్లుల్లి చేసే మేలు


​వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఇది ఓ వరం. ఈ రెండింటిని కంట్రోల్ చేసే గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. వెల్లుల్లిలో ఉండే అలిసిన్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు ఈ ఆరోగ్య ప్రయోజనాలకు ప్రధాన కారణం. ఇక, పులియబెట్టిన వెల్లుల్లి.. సాధారణ వెల్లుల్లి కంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని డాక్టర్ శిల్పా అరోరా చెబుతున్నారు. పులియబెట్టడం వల్ల వెల్లుల్లిలోని పోషకాలు మరింత బయోఅవైలబుల్ అవుతాయి. అంటే శరీరం వాటిని సులభంగా గ్రహిస్తుంది. వెల్లుల్లిని ఎలా పులియబెట్టాలో ఓ లుక్కేద్దాం.


కావాల్సిన పదార్థాలు


* వెల్లుల్లి - ఒక గిన్నె బాగా శుభ్రం చేసిన వెల్లుల్లి రెబ్బలు


* నీరు - రెండు గ్లాసులు


* ఉప్పు - రెండు టేబుల్ స్పూన్లు


* రోజ్మేరీ - కాస్తా (సువాసన కోసం)


* ఎర్ర మిరపకాయలు- ఐదు నుంచి ఆరు


తయారీ విధానం


ముందుగా ఒక జార్ తీసుకోండి. ఈ జార్‌లో రెండు గ్లాసుల నీరు ముందుగా పోయండి. ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి బాగా కలపండి. ఆ తర్వాత పొట్టు తీసి బాగా శుభ్రం చేసిన ఒక గిన్నె వెల్లుల్లి రెబ్బల్ని వేయండి. ఆ తర్వాత రోజ్మేరీ వేయండి. ఇది సువాసక కోసమని డాక్టర్ శిల్పా అరోరా చెప్పారు. ఆ తర్వాత ఓ ఐదు నుంచి ఆరు ఎర్ర మిరపకాయలు వేయండి. ఆ తర్వాత జార్‌పై మూత పెట్టి బాగా క్లోజ్ చేయండి. ఈ మిశ్రమాన్ని ఓ పదిహేను రోజులు పులియబెట్టండి. పదిహేను రోజుల తర్వాత పులియబెట్టిన వెల్లుల్లి రెడీ.


వాడే విధానం


ప్రతిరోజూ 1-2 పులియబెట్టిన వెల్లుల్లి రెబ్బలను ఉదయం ఖాళీ కడుపుతో తినడం ద్వారా ప్రయోజనాలు పొందవచ్చని డాక్టర్ శిల్పా అరోరా చెబుతున్నారు. కావాలంటే మీరు సూప్‌లు, కూరలు, సలాడ్‌లు, సాస్‌లు, మెరినేడ్‌లు, ఇతర వంటకాలలో చేర్చుకోవచ్చని డాక్టర్ చెబుతున్నారు. పులియబెట్టిన వెల్లులి తీసుకున్న తర్వాత ఆ జార్‌ని ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చని శిల్పా తెలిపారు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిజ్‌లో నుంచి తీసి వెల్లుల్లి తినవచ్చని డాక్టర్ చెప్పారు.


పులియబెట్టిన వెల్లుల్లితో ప్రయోజనాలు


* పులియబెట్టిన వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సాయపడుతుంది. ఇది ధమనులలో ఫలకం ఏర్పడకుండా నిరోధించి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.


* వెల్లుల్లి రక్త నాళాలను సడలించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సాయపడుతుంది. పులియబెట్టిన వెల్లుల్లిలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచే గుణాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతారు. ఇది రక్త నాళాలను విస్తరించి రక్తపోటును తగ్గిస్తుంది.


* వెల్లుల్లిలో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. దీంతో, జలుబు, ఫ్లూ వంటి అంటువ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.


* పులియబెట్టిన వెల్లుల్లిలో ప్రీబయోటిక్స్ ఉంటాయని డాక్టర్ శిల్పా చెప్పారు. ఇవి పేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa