భారత్ బంకర్-బస్టర్ బాంబుల తయారీని వేగవంతం చేసింది. భవిష్యత్తులో జరిగే యుద్ధాలకు సిద్ధమయ్యేందుకు శక్తివంతమైన క్షిపణి వ్యవస్థను నిర్మిస్తోంది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ( డీఆర్‌డీఓ ) అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి కొత్త వెర్షన్‌ను అభివృద్ధి చేస్తోంది. దీని పరిధి 5 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్తగా రూపొందించే క్షిపణి 7500 కిలోల బరువు ఉన్న బంకర్-బస్టర్ వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదని చెబుతున్నారు. ఈ క్షిపణి 80 మీటర్ల నుంచి 100 మీటర్ల వరకు భూమిలోకి చొచ్చుకుపోయి పేలే సామర్థ్యం ఉందని సంబంధిత నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో భాగంగా జూన్ 22వ తేదీన ఇరాన్‌లోని ఫోర్డో అణు కర్మాగారంపై అమెరికా బంకర్-బస్టర్ బాంబులను వేసింది. బీ-2 బాంబర్ విమానాల ద్వారా జీబీయూ-57/ఏ మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్స్ బాంబులను జారవిడిచింది. ఈ దాడిలో ఇరాన్ అణు కర్మాగారం తీవ్రంగా ధ్వంసం కావడంతో ప్రపంచం దృష్టి దానిపైనే పడింది. ఇరాన్ తన అణు కర్మాగారాన్ని పర్వతాల మధ్య, భూమికి 100 మీటర్ల లోతులో నిర్మించింది. అయితే సాధారణ బాంబులతో ఈ అణు కర్మాగారాన్ని నాశనం చేయడం చాలా కష్టం. అందుకే అమెరికా బంకర్-బస్టర్ బాంబులను ఉపయోగించింది. ఈ బాంబులు 60 మీటర్ల నుంచి 70 మీటర్ల రంధ్రం చేసి మరీ భూమిలోకి చొచ్చుకువెళ్లి పేలే గుణాన్ని కలిగి ఉంటాయి. శత్రువుల భూగర్భ బంకర్లను కూడా నాశనం చేసేందుకు ఈ బంకర్ బ్లస్టర్ బాంబులను ఉపయోగిస్తారు.
ఈ క్రమంలోనే సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. భారత్ కూడా వీటిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే రెండు కొత్త రకాల అగ్ని-5 క్షిపణులను భారత్ అభివృద్ధి చేస్తోంది. ఒకటి ఎయిర్‌బర్స్ట్ వార్‌హెడ్‌తో, మరొకటి లోతైన-ఛేదక వార్‌హెడ్‌తో తయారు చేస్తున్నారు. హైపర్‌సోనిక్ వేగంతో దూసుకెళ్లేలా ఈ రెండు అగ్ని-5 క్షిపణులను తయారు చేస్తున్నారు. భూగర్భ లక్ష్యాలను ఛేదించగల శక్తివంతమైన కొత్త క్షిపణి వ్యవస్థను నిర్మించడం ద్వారా భారత్ భవిష్యత్ యుద్ధాలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోందని అధికారులు వెల్లడించారు. దీని ద్వారా దేశ రక్షణ మరింత పటిష్టంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa