ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో స్పై విమానాలు, మైన్స్‌స్వీపర్లు

national |  Suryaa Desk  | Published : Fri, Jul 04, 2025, 09:41 PM

దేశ భద్రతను మరింత పటిష్ఠం చేసేలా రూ.లక్ష కోట్లకుపైగా విలువైన 10 కీలక ఆయుధ ప్రాజెక్ట్‌లకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం (జులై 4) ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. ఇందులో మూడు ప్రధాన ప్రాజెక్టులు కాగా, మిగిలిన ఏడూ తక్కువ కొనుగోళ్లకు సంబంధించినవి. అయినప్పటికీ ఇవి దేశ భద్రతా సామర్థ్యాన్ని పెంచే దిశగా కీలకమైనవి. ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా తయారీ ఆయుధాలనే పాకిస్థాన్ వినియోగించినట్టు నివేదికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశ రక్షణ కోసం కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.


రక్షణ శాఖ ఆమోదం తెలిపినవాటిలో అత్యంత భారీ ప్రాజెక్టు మైన్స్ కౌంటర్ మెజర్ వెసెల్స్ (MCMVs). దీని విలువ రూ. 44,000 కోట్లు. ఈ ప్రాజెక్టు కింద భారత నౌకాదళం కోసం 12 స్వదేశీ మైన్స్ కౌంటర్ మెజర్ వెసెల్స్ (MCMVs) నిర్మించనున్నారు. దాదాపు 900-1000 టన్నుల సామర్థ్యం కలిగి ఉండే ఈ నౌకలు.. సముద్రంలో శత్రువుల బాంబులను (మైన్స్) గుర్తించి, ట్రాక్ చేసి, ధ్వంసం చేయగలవు. ఇవి పోర్టులు, నౌకాశ్రయాలను రక్షించేందుకు అత్యంత అవసరం. అయితే, వీటి నిర్మాణం పూర్తవడానికి సుమారు పదేళ్లు పట్టే అవకాశం ఉంది. చైనా–పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న మారీటైమ్ సహకారం దృష్ట్యా ఇది అత్యవసరం.


ఇక, రెండో అతిపెద్ద ప్రాజెక్ట్ రూ.36 వేల కోట్లతో క్విక్ రియాక్షన్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ (QRSAM). ఈ ప్రాజెక్టు కింద DRDO అభివృద్ధి చేసిన QRSAM వ్యవస్థలను తయారుచేయనున్నారు. ఆర్మీలోని మూడు రెజిమెంట్లు, ఎయిర్ ఫోర్స్‌లోని మూడు స్క్వాడ్రన్లకు వీటిని అందజేయనున్నారు. మొత్తం 30 కిలోమీటర్ల పరిధిలో శత్రు యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను గుర్తించి, వాటిని ధ్వంసం చేసే సామర్థ్యం వీటి సొంతం. మే 7-10 మధ్య జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ ప్రయోగించిన టర్కీ డ్రోన్లు, చైనా మిస్సైళ్లను అడ్డుకునే విషయంలో భారత వైమానిక రక్షణ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. అందుకే గగనతల రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. భవిష్యత్తులో మొత్తం 11 రెజిమెంట్లకు వీటి అవసరం ఉండొచ్చని భారత ఆర్మీ భావిస్తోంది.


తర్వాత రూ.10 వేల కోట్లతో ఇంటెలిజెన్స్, సర్వైలియన్స్ టార్గెట్ అక్విజిషన్ అండ్ రీకాన్సెస్ (ISTAR) ప్రాజెక్ట్. ఈ మూడు వ్యవస్థలు శత్రువుల భూభాగాలపై ఉన్న అత్యంత విలువైన లక్ష్యాలను గుర్తించి, క్షిపణులు, యుద్ధవిమానాల ద్వారా సమర్థవంతంగా ధ్వంసం చేయడానికి ఉపయోగపడతాయి. DRDO అభివృద్ధి చేసిన అధునాతన సెన్సార్లు (సింటెటిక్ అపర్చర్ రాడార్లు, ఎలెక్ట్రో-ఆప్టికల్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్లు) వాటికి అమర్చనున్నారు. ఇవి శత్రు స్థావరాల కదలికలపై క్షేత్రస్థాయి సమాచారాన్ని రియల్‌టైమ్‌లో అందిస్తాయి. ఇక, తమ ఉనికికి భారత్‌ను ముప్పుగా చూస్తోన్న పాక్.. చైనా సహకారంతో ఆయుధాలను అధునీకరిస్తున్నట్టు ఇటీవల నివేదిక ఒకటి బయటపెట్టింది.


ఇతర ప్రాజెక్టులు: ఐఎస్‌ఆర్ (ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్, రీకాన్సెన్స్) కోసం సెమీ-సబ్‌మర్సిబుల్ ఆటానమస్ వెసెల్స్, పరిశ్రమ ఆధారిత 'మ్యాక్-II' కేటగిరీలో దీనిని అభివృద్ధి చేయనున్నారు. శత్రు ప్రాంతాల్లో గూఢచార్యానికి ఉపయోగపడే నౌకలు, డీఆర్డీఓ అభివృద్ధి. చేసిన సూపర్ రాపిడ్ గన్ మౌంట్స్ (SRGM), 76mm వెసల్ గన్స్,, ప్రాసెసర్-బేస్డ్ మూల్డ్ మైన్స్ (శత్రు నౌకల శబ్ద, మాగ్నెటిక్ లేదా ప్రెషర్ సిగ్నెచర్లను గుర్తించి పేలే మైన్లు), .ఆర్మర్డ్ రికవరీ వెహికల్స్, యుద్ధ ట్యాంకులు ఆయుధాలను యుద్ధభూమి నుంచి తరలించేందుకు. ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థలు, శత్రు కమ్యూనికేషన్లు, రాడార్ వ్యవస్థలను పసిగట్టే ట్రై-సర్వీస్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ICIMS) ఈ ప్రాజెక్టులో ఉన్నాయి. ప్రాజెక్టులన్నీ స్వదేశీ టెక్నాలజీ అభివృద్ధికి, బలమైన భద్రతా మౌలిక వసతుల నిర్మాణానికి దోహదపడతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa