ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాయలసీమను రతనాల సీమగా మారుస్తా,,, హంద్రీనీవా నీటిని విడుదల చేసిన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 17, 2025, 06:10 PM

నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హంద్రీనీవా ప్రాజెక్టు నీటిని గురువారం మధ్యాహ్నం విడుదల చేశారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని నేరుగా సీఎం చంద్రబాబు మాల్యాలకు చేరుకుని.. అక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన చంద్రబాబు, రాయలసీమ కరవును తాను దగ్గర నుంచి చూశానని, హంద్రీనీవా, గాలేరు నగరి వంటి ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని, కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని ఆయన విమర్శించారు. రాయలసీమకు నీళ్లు ఇచ్చిన సంతృప్తిని ఎప్పటికీ మర్చిపోలేనని సీఎం చంద్రబాబు అన్నారు. త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేయనున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు. ఇప్పటికే బెంచ్ ఏర్పాటుకు స్థల సేకరణ కోసం పరిశీలన జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ భవనం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అలాగే, ఆగస్టు 15 నుంచి వాట్సాప్ ద్వారా 700 ప్రభుత్వ సేవలు అందజేయనున్నట్టు చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి కూడా ఆ రోజే శ్రీకారం చుడుతున్నట్టు పునరుద్ఘాటించారు.


రాయలసీమ ప్రజల కష్టాలు తనకు తెలుసని సీఎం చంద్రబాబు అన్నారు. తాను ఇక్కడే పుట్టి పెరిగానని గుర్తు చేసుకున్నారు. అనంతపురంలో కరవు వస్తే గడ్డి తెచ్చి పశువులను కాపాడిన పార్టీ తమదని చెప్పారు. రాయదుర్గం ఎడారిగా మారకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎన్టీఆర్ సీమ చరిత్రను తిరగరాయాలని తొలిసారి ఆలోచించారని చంద్రబాబు అన్నారు. హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులకు ఎన్టీఆరే శ్రీకారం చుట్టారని చెప్పారు. ఆయన ఆశయాలను టీడీపీ ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు. ‘రాయలసీమకు నీరిచ్చాకే చెన్నైకి నీళ్లు ఇస్తానని ఆనాడు ఎన్టీఆర్‌ చెప్పారు’ అని చంద్రబాబు గుర్తు చేశారు.


హంద్రీనీవా నీరు 550 కిలోమీటర్లు ప్రవహించి చిత్తూరు, కుప్పం వరకు వెళ్తోందని చంద్రబాబు అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. మల్యాల ద్వారా సుమారు 4 TMCల నీరు తీసుకెళ్లొచ్చని చెప్పారు. కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి, PABR, మారాల, గొల్లపల్లి, చెర్లోపల్లి, మదనపల్లె, చిత్తూరుకు నీరిచ్చే అవకాశం వస్తుందని అన్నారు. సమస్య వస్తే సవాలుగా తీసుకుని పనిచేసే మనస్తత్వం తనదని చంద్రబాబు అన్నారు. వేరే రాష్ట్రానికి వెళ్తున్న కియా కంపెనీని అనంతపురం తీసుకొచ్చామని చెప్పారు. 8 నెలల్లో గొల్లపల్లి పూర్తి చేసి కియాకు నీళ్లిచ్చిన ఘనత తమదని అన్నారు. రాయలసీమ రైతు కుటుంబాల్లో మార్పు రావాలనేదే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తొలి దశలో 1.98 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు వస్తుందని తెలిపారు.


‘‘ఒక్క ఛాన్స్‌ అంటూ వచ్చి ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని నాశనం చేశారు’ అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రానికి మంచి పేరు రావాలని, ప్రజల జీవితాలు బాగుపడాలని తాను నిత్యం కోరుకుంటానని అన్నారు. రాయలసీమకు రూ.2 వేల కోట్లు కూడా గత ప్రభుత్వం ఖర్చు చేయలేదని ఆరోపించారు. హంద్రీనీవాకు కనీసం ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టారా? అని ప్రశ్నించారు. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది తమ ప్రభుత్వమేనని చంద్రబాబు పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, గండికోట ప్రాజెక్టులు తమ హయాంలోనే వచ్చాయని చెప్పారు.


నదుల అనుసంధానం జరగాలనేది తన జీవిత ఆశయమని అన్నారు. పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానిస్తే కరవు అనే మాటే ఉండదని తెలిపారు. ఇప్పుడు రాయలసీమలోని అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయని చెప్పారు. రాయలసీమను రతనాలసీమగా మారుస్తామనే ధైర్యం తనకు వచ్చిందని అన్నారు. శ్రీశైలం నుంచి SRBC, ముచ్చుమర్రి, మల్యాల కాల్వలు వస్తాయని తెలిపారు. హంద్రీనీవా నుంచి అనంతపురం, పత్తికొండ, గొల్లపల్లికి మరో కాల్వ వెళ్తుందని చెప్పారు. గాలేరు-నగరి నుంచి గండికోట, అవుకు, మైలవరానికి నీళ్లు వస్తాయని తెలిపారు. శ్రీశైలం నుంచి ప్రారంభమైన నీరు తిరుపతికి వెళ్లే పరిస్థితి వస్తుందని చంద్రబాబు అన్నారు.


రాజకీయాలు, సమస్యలు ఎప్పుడూ ఉంటాయని చంద్రబాబు అన్నారు. రాయలసీమలో అన్ని రకాల వనరులు ఉన్నాయని, మంచి రోడ్లు ఉన్నాయని, ఎక్కడికైనా సులువుగా వెళ్లవచ్చని అన్నారు. వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు ఒక్క గుంతను కూడా పూడ్చలేదని విమర్శించారు. రాష్ట్రంలో రహదారులను అందంగా మారుస్తామని చెప్పారు. "చెప్పిన ప్రతిమాట నిలబెట్టుకుంటున్నానా? లేదా?" అని చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు. గత ప్రభుత్వం పింఛను రూ. వెయ్యికి పెంచేందుకు ఐదేళ్ల సమయం తీసుకుంటే, తాము వచ్చాక ఒకేసారి రూ. వెయ్యి పెంచి పింఛను ఇచ్చామని అన్నారు. దివ్యాంగుల పింఛను ఒకేసారి రూ.6 వేలకు పెంచిన ఘనత తమదేనని చెప్పారు. పేదవాడికి అన్నం పెట్టే క్యాంటీన్లు మూసేశారని, తాము వచ్చాక మళ్లీ 207 అన్న క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. 21 దేవాలయాల్లో అన్నప్రసాదం ప్రారంభించామని చంద్రబాబు అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa