ఇంజిన్ ఫెయిల్ కావడంతో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఢిల్లీ నుంచి గోవాకు వెళ్తున్న విమానాన్ని ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటన నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బుధవారం (జూలై 16) రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని న్యూస్ ఏజెన్సీ PTI తెలిపింది. మరోవైపు ఢిల్లీ నుంచి పాట్నాకు వెళ్తున్న మరో ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో సమస్యను ఎదుర్కొంది. రన్‌వే సరిపోకపోవడంతో పైలట్ ల్యాండింగ్‌ను విరమించుకున్నాడు. విమానం నేలను తాకిన మరుక్షణమే తిరిగి గాల్లోకి ఎగిరింది. వరుస ఘటనలు విమాన ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
తాజాగా సమస్యకు గురైన విమానం ఢిల్లీ నుంచి రాత్రి 8 గంటలకు బయలుదేరినట్లు తెలుస్తోంది. నిర్ణీత సమయం కంటే అరగంట ఆలస్యంగా బయలుదేరింది. ఆ తర్వాత మార్గమధ్యంలో ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాత్రి 10 గంటలకు అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
ప్రయాణికుల కోసం ముంబై నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఇండిగో ప్రతినిధి చెప్పారని న్యూస్ ఏజెన్సీ ANI పోస్టు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇండిగో మాత్రమే కాకుండా ఇతర విమానయాన సంస్థలు కూడా తరచూ ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ముంబై నుంచి దుబాయ్‌కు వెళ్లే ఎమిరేట్స్ విమానం సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయి, దాదాపు 3 గంటలు ఆలస్యమైంది. ప్రయాణికులను తిరిగి పంపి భద్రతా తనిఖీలు చేయడంతో మరింత ఇబ్బంది కలిగింది.
మరోవైపు.. ముంబై నుంచి దుబాయ్‌కి వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం బుధవారం ఉదయం రద్దయింది. లక్నో విమానాశ్రయంలో బోయింగ్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఇండోర్ నుంచి రాయ్‌పూర్‌కు 51 మంది ప్రయాణికులతో వెళ్తున్న మరో ఇండిగో విమానం సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి వచ్చేసింది. వరుస ఘటనలతో విమానాల నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ ఘటనలన్నింటిలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిసింది. కానీ, వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు విమానయాన రంగంలో భద్రత, విశ్వసనీయతపై సందేహాలను లేవనెత్తుతున్నాయి. భారతదేశంలో 64% వాటాతో IndiGo అతిపెద్ద విమానయాన సంస్థగా ఉంది. ఇది భారత్‌లోని పలు విమానాశ్రయాల నుంచి ఆఫ్రికా, మధ్య ఆసియా, యూరప్ దేశాలకు నేరుగా విమానాలను నడుపుతోంది. అయితే, గత కొన్ని నెలలుగా ఈ సంస్థ సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రయాణికుల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై విమానయాన అధికారులు దృష్టి సారించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa