దేశంలో రోడ్డు భద్రతను పెంపొందించడం, ట్రాఫిక్ నియమాలను కఠినంగా అమలు చేయడం లక్ష్యంగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా వాహనాలపై పిల్లలను తీసుకుని వెళ్తున్నప్పుడు.. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే విధించే జరిమానాలను రెట్టింపు చేయాలని ఒక కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఈ చర్య తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పాఠశాల బస్సుల నిర్వాహకులు నిబంధనలను పాటించడంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించేలా ప్రోత్సహిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
అంతేకాకుండా డ్రైవర్ల ప్రవర్తనను పర్యవేక్షించేందుకు ఒక నూతన 'మెరిట్ మరియు డీమెరిట్' పాయింట్ల విధానాన్ని ప్రవేశ పెట్టాలని కూడా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ విధానం డ్రైవింగ్ చరిత్రను నేరుగా బీమా ప్రీమియంలతో అనుసంధానిస్తుంది. అంటే డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను తరచుగా ఉల్లంఘిస్తే.. వారి బీమా ప్రీమియంలు పెరిగే అవకాశం ఉంది. అలాగే నిర్దిష్ట సంఖ్యలో డీమెరిట్ పాయింట్లు చేరుకుంటే.. డ్రైవర్ల లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేస్తారు.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన డ్రైవర్లు తమ లైసెన్స్ పునరుద్ధరణ సమయంలో తప్పనిసరిగా మరోసారి డ్రైవింగ్ పరీక్ష (రీటెస్టింగ్) రాయాలని కూడా ఈ ప్రతిపాదనలో ఉంది. ఈ చర్యలు డ్రైవర్లలో బాధ్యతను పెంచి, ప్రమాదాలను తగ్గించడానికి దోహద పడతాయని ప్రభుత్వం భావిస్తోంది. మోటార్ వాహనాల చట్టానికి చేయబోయే ఈ సవరణల ముసాయిదాను ప్రస్తుతం అన్ని వర్గాల అభిప్రాయాలు, సూచనల కోసం ప్రచారంలో ఉంచారు.
అయితే ఈ ప్రతిపాదనలపై కొందరు రోడ్డు భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ఉల్లంఘనలను జోడించడం వల్ల కేవలం చట్టపరమైన ప్రక్రియలు పెరిగి, అవినీతికి దారితీసే ప్రమాదం ఉందని వాదిస్తున్నారు. ముఖ్యంగా వాహనంలో పిల్లలు ఉన్నారా లేదా అని ట్రాఫిక్ పోలీసులకు గుర్తించడం ఆచరణాత్మకంగా ఎంత వరకు సాధ్యమనే ప్రశ్నను కూడా వారు లేవనెత్తుతున్నారు. ఈ నిబంధనల అమలులో పారదర్శకత, లక్ష్యం స్పష్టంగా లేకపోతే.. అవి ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా ఈ సవరణలపై ప్రజలు, నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa