ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబయి రైలు పేలుళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఆ 12 మంది నిర్దోషులే

national |  Suryaa Desk  | Published : Mon, Jul 21, 2025, 07:35 PM

దేశ చరిత్రలో ఓ చీకటి అధ్యాయంగా నిలిచిన 2006 ముంబై రైలు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 12 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ.. కింది కోర్టు ఇచ్చిన శిక్షలను రద్దు చేసింది. నిందితులపై అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ 'పూర్తిగా విఫలమైంది' అని న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ తీర్పు న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకాన్ని పునరుద్ధరిస్తుందని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.


2006 జులై 11వ తేదీన పశ్చిమ రైల్వే లైన్‌లోని పలు సబ్బరన్ రైళ్లలో వరుసగా బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనలో మొత్తంగా 189 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 800 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సుదీర్ఘ దర్యాప్తు అనంతరం 2015 అక్టోబర్‌లో ప్రత్యేక కోర్టు 12 మంది నిందితులను దోషులుగా తేల్చింది. వీరిలో బాంబు అమర్చారన్న అభియోగాలపై ఐదుగురికి మరణశిక్ష పడగా.. మిగతా ఏడుగురికి జీవితఖైదు విధించింది. ఈక్రమంలోనే వీరంతా హైకోర్టును ఆశ్రయించారు. వాటిని సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసింది. 2015 నుంచి ఈ అంశం ఉన్నత న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది.


అయితే దీనిపై అనేక అభ్యర్థనల తర్వాత 2024లో రోజువారీ విచారణ నిమిత్తం ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేసింది హైకోర్టు. ఈక్రమంలోనే తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం సంచలన తీర్పును ఇచ్చింది. ముఖ్యంగా దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు ఈ మరణ శిక్షలను ధృవీకరించడానికి నిరాకరించడమే కాకుండా.. నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. నిందితులను దోషులుగా ప్రకటించడంలో ట్రయల్ కోర్టు లోపభూయిష్టంగా వ్యవహరించిందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అలాగే ఈ కేసులో ప్రాసిక్యూషన్ వైఫల్యానికి పలు కారణాలను హైకోర్టు స్పష్టం చేసింది.


ముఖ్యంగా పేలుళ్లకు ఉపయోగించిన పేలుడు పదార్థం ఏ రకమైనదో స్పష్టంగా చెప్పడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంది. ఇది కేసు బలాన్ని గణనీయంగా తగ్గించిందని న్యాయస్థానం వెల్లడించింది. అంతేకాకుండా నిందితుల ఒప్పుకోలు వాంగ్మూలాలు చెల్లుబాటు కావని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ వాంగ్మూలాలను చిత్రహింసల ద్వారా బలవంతంగా రాబట్టారని డిఫెన్స్ తరపు న్యాయవాదులు వాదించగా.. న్యాయస్థానం ఆ వాదనలను పరిగణనలోకి తీసుకుంది. సాక్షుల గుర్తింపు పరేడ్‌లో కూడా విశ్వసనీయత లోపించిందని, సాక్షుల వాంగ్మూలాలు సరైనవి కావని హైకోర్టు నిర్ధారించింది. ఈ అంశాలన్నీ కేసును నిర్వీర్యం చేశాయని న్యాయస్థానం అభిప్రాయ పడింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa