ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్‌లో బహిరంగంగా ప్రేమికుల జంటని కాల్చి చంపిన మహిళా సోదరుడు

international |  Suryaa Desk  | Published : Wed, Jul 23, 2025, 04:28 PM

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఒక మహిళ, ఆమె ప్రియుడు జిర్గా (గిరిజన పెద్దల మండలి) ఆదేశాల మేరకు దారుణ హత్యకు గురైన భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ హృదయ విదారక ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు రేకెత్తించగా, బలూచిస్థాన్ పోలీసులు వేగంగా స్పందించి, ఆ మహిళ సోదరుడు, జిర్గా నాయకుడు సహా 13 మందిని అరెస్ట్ చేశారు.వైరల్ అయిన వీడియోలో బానో బీబీ, ఇహ్సానుల్లా అనే జంటను "అనైతిక సంబంధం" ఆరోపణతో ఒక ఎడారి ప్రాంతంలో కాల్చి చంపారు. ఈ అమానుషమైన హత్యలో బానో బీబీ సోదరుడు కూడా పాల్గొన్నట్టు తెలిసింది. జిర్గా నాయకుడు సర్దార్ షేర్బాజ్ సటక్‌జాయ్ ఈ హత్యకు ఆదేశించినట్టు పోలీసులు వెల్లడించారు. వీడియోలో బానో బీబీ ఖురాన్‌ను చేతిలో పట్టుకుని "నాతో ఏడు అడుగులు నడవండి.. ఆ తర్వాత నన్ను కాల్చవచ్చు" అని బ్రాహ్వీ భాషలో చెప్పినట్టు కనిపిస్తుంది. ఆ వెంటనే, ఆమె, ఇహ్సానుల్లాను బహిరంగంగా, అత్యంత దగ్గరి నుంచి కాల్చి చంపారు. జూన్‌లో ఈద్-ఉల్-అజ్హాకు మూడు రోజుల ముందు క్వెట్టా సమీపంలోని సంజిదీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ నెల 20న ఈ వీడియో సామాజిక మాధ్యమాలకు ఎక్కడంతో పౌర హక్కుల కార్యకర్తలు, బలోచ్ గ్రూపుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసనల ఒత్తిడితో పోలీసులు 13 మంది నిందితులను అరెస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa