టీమిండియాని అత్యంత భ్రష్టు పట్టించిన కోచ్ ఎవరైనా ఉన్నారంటే అది గ్రెగ్ చాపెల్ ఒక్కడే. జాన్ రైట్ శకంలో టీమిండియా ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. 2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ వరకూ వెళ్లగలిగింది. రైట్ పదవీకాలం ముగిసిన తర్వాత వచ్చిన గ్రెగ్ చాపెల్ హయాంలో టీమిండియాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. గంగూలీ లాంటి హేమాహేమీలను సైతం నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించేలా చేశాడు. అలాంటి చాపెల్‌తో జరిగిన ఓ క్లాష్‌ను డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి పదకొండేళ్లు అయినప్పటికీ వీరేంద్ర సెహ్వాగ్ ఇప్పటికీ టీమిండియా అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. బంతి వచ్చిందా బౌండరీకే అన్నట్టు అరివీర భయంకర ఓపెనర్‌గా సెహ్వాగ్ పేరు తెచ్చుకున్నాడు. సునీల్ గవాస్కర్ తర్వాత భారత క్రికెట్లోనే గొప్ప టెస్ట్ ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 2004లో తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచిన సెహ్వాగ్.. నాలుగేళ్ల తర్వాత చెన్నైలో సౌతాఫ్రికాపై మరో ట్రిపుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు.
2005 భారత క్రికెట్లో కొత్త అధ్యాయం మొదలైంది.. అదే గ్రెగ్ చాపెల్ యుగం. జాన్ రైట్ వెళ్లిపోవడంతో కొత్తగా కోచ్‌గా వచ్చిన చాపెల్ ఆరంభంలోనే పెద్ద మార్పులు చేస్తాడని అనుకున్నారు. కానీ ఆ మార్పులు జట్టులో ఉద్రిక్తతలు, విభేదాలను తెచ్చాయి. సౌరవ్ గంగూలీని కెప్టెన్సీ నుండి తొలగించడమే కాకుండా.. ఆ తర్వాత జట్టులో నుంచి కూడా వెళ్లేలా చేశాడు. సచిన్ టెండూల్కర్‌ను కూడా కెప్టెన్‌గా చేయాలని ప్రయత్నం జరిగింది. హర్భజన్ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి సీనియర్లకు కూడా గడ్డుకాలం నడిచింది. గ్రెగ్ చాపెల్ తుఫాన్‌కు సెహ్వాగ్ కూడా ఏ మాత్రం మినహాయింపు కాలేదు.
"ఆ సమయంలో నేను రన్స్ చేయడం లేదు. చాపెల్ వచ్చి, 'నీ కాళ్లు కదలకపోతే అంతర్జాతీయ స్థాయిలో రన్స్ చేయలేవు' అన్నాడు. నేను అతనికి, 'గ్రెగ్, నేను ఇప్పటికే టెస్టుల్లో 6000 పరుగులు చేశాను.. అవరేజ్ 50 కంటే ఎక్కువ. ఇప్పుడు కూడా నేర్చుకోవాలా?' అని అన్నాను. కానీ అతను పట్టువదల్లేదు. మేమిద్దరం వాగ్వాదం చేసుకున్నాం. అప్పుడు కెప్టెన్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ మాకు సర్ది చెప్పాడు. మరుసటి రోజు బ్యాటింగ్‌కి వెళ్లే ముందు చాపెల్ మళ్లీ చెప్పాడు – 'రన్స్ చేయకపోతే నిన్ను డ్రాప్ చేస్తాను. నేను నీ ఇష్టం అన్నాను. ఒక బ్యాటర్ క్రీజ్‌లోకి వెళ్తుంటే కోచ్ ఇలాంటివి చెప్పడమేంటి?" అని సెహ్వాగ్ "ది లైఫ్ సేవర్" పాడ్‌కాస్ట్‌లో వెల్లడించాడు.
"అది విన్న వెంటనే నేను గట్టిగా ఆడడం మొదలుపెట్టాను. లంచ్‌కు ముందే 99 పరుగులు చేశాను. డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్తుంటే ద్రవిడ్ ఎదురుపడ్డాడు. నేను అతనికి 'నీ కోచ్‌కి చెప్పు – నా జోలికి రావొద్దని' అన్నాను. ఆ తరువాత మళ్లీ బ్యాటింగ్ కొనసాగించాను. టీ బ్రేక్‌కి దగ్గరగా 184 పరుగుల వద్ద ఔటయ్యాను. అప్పుడూ చాపెల్‌ను చూసి, 'నేను కాళ్లు కదిలించానా లేదా అనేది ముఖ్యం కాదు… నాకు రన్స్ చేయడం వస్తుంది' అన్నాను" అని సెహ్వాగ్ చెప్పాడు.
ఈ సంఘటన 2006లో ఇండియా – వెస్టిండీస్ టెస్ట్ (గ్రాస్ ఐస్లెట్) మ్యాచ్‌లో అయ్యుండొచ్చు. ఆ మ్యాచ్‌లో సెహ్వాగ్ 180 పరుగులు చేశాడు. ద్రవిడ్ (140), మహ్మద్ కైఫ్ (148 నాటౌట్) సెంచరీలతో భారత్ 588/8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కానీ మ్యాచ్ డ్రాగా ముగిసింది. సెహ్వాగ్ తన కెరీర్లో 104 టెస్టుల్లో 8586 పరుగులు చేసి భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa