ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీని గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 15, 2025, 07:38 PM

ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ, సైబర్‌సెక్యూరిటీ రంగాల్లో గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నామని, ఈ లక్ష్య సాధనలో ప్రపంచ ఆర్థిక వేదిక  సహకారం అందించాలని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ కోరారు. విశాఖపట్నంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సెంటర్ ఫర్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జుర్గెన్స్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను, భవిష్యత్ ప్రణాళికలను ఆయన వివరించారు.మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, "2070 నాటికి కర్బన ఉద్గార రహిత దేశంగా మారాలన్న భారత ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ చిత్తశుద్ధితో పనిచేస్తోంది. 2040 నాటికి దేశంలో విద్యుత్ అవసరాలు రెట్టింపు కానున్న నేపథ్యంలో, పునరుత్పాదక ఇంధన వనరులపై ఆధారపడటం అత్యవసరం. మేము మార్పు కోసం వేచి చూడటం లేదు, మార్పును ముందుండి నడిపిస్తున్నాం. రాష్ట్రాన్ని ప్రపంచ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చాలన్నదే మా సంకల్పం అని స్పష్టం చేశారు. ఈ క్రమంలో పునరుత్పాదక ఇంధన రంగంలో 115 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దేశ గ్రీన్ హైడ్రోజన్ లక్ష్యంలో 30 శాతం వాటాను ఏపీ నుంచే అందించాలని ధ్యేయంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇవి కేవలం గణాంకాలు కావని, రాష్ట్ర విద్యుత్ భద్రతకు, ఆర్థిక ప్రగతికి, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ఆయన వివరించారు.ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్‌సెక్యూరిటీ జాతీయ భద్రతలో కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి లోకేశ్ అన్నారు. "అక్టోబర్ 2023 నుంచి సెప్టెంబర్ 2024 మధ్య కాలంలోనే భారతదేశంలో 369 మిలియన్లకు పైగా సైబర్ దాడులు నమోదయ్యాయి. 2033 నాటికి ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడుల వల్ల కలిగే నష్టం 1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఇది అత్యంత ఆందోళనకరమైన విషయం. ఈ దాడులు కీలక మౌలిక సదుపాయాలకు, ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా మారతాయి అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్ వేగంగా ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న తరుణంలో పరిశ్రమలు, రవాణా, విద్యుత్ వంటి కీలక రంగాలకు పటిష్టమైన సైబర్ భద్రత కల్పించడం అత్యంత ప్రాధాన్యతాంశమని లోకేశ్ పేర్కొన్నారు.ఈ సవాలును అధిగమించడానికి మాకు ఒక గొప్ప అవకాశం ఉంది. రాష్ట్రంలోని విద్యార్థుల్లో 70 శాతం మంది సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్  కోర్సుల్లోనే ఉన్నారు. ఈ మానవ వనరులను సద్వినియోగం చేసుకొని, స్వదేశీ సైబర్‌సెక్యూరిటీ నిపుణులను తయారుచేస్తాం. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 40 లక్షల సైబర్ నిపుణుల కొరతను తీర్చడంలో మా వంతు పాత్ర పోషిస్తాం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.చమురు, విద్యుత్, సప్లయ్ చెయిన్ వంటి కీలక రంగాల్లో సైబర్‌సెక్యూరిటీ మూల్యాంకన నమూనాలను అమలు చేయడంలో సహకరించాలని, ముఖ్యంగా డబ్ల్యూఈఎఫ్ అభివృద్ధి చేసిన 'స్ట్రాటజిక్ సైబర్‌సెక్యూరిటీ టాలెంట్ ఫ్రేమ్‌వర్క్'ను ప్రయోగాత్మకంగా అమలు చేసి, నిపుణులైన మానవ వనరులను ప్రోత్సహించాలని కోరారు.సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవిల్యూషన్  ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని, దీని విజయానికి భాగస్వాముల సహకారం అత్యంత కీలకమని లోకేశ్ అన్నారు. ఈ ప్రయాణంలో కేవలం ఆర్థికంగానే కాకుండా, మేధోపరంగా, కార్యనిర్వహణ పరంగా కూడా సంస్థాపక భాగస్వాములుగా చేరాలని జెరెమీని ఆహ్వానించారు.మంత్రి లోకేశ్ విజ్ఞప్తిపై జెరెమీ జుర్గెన్స్ సానుకూలంగా స్పందించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో క్లీన్ ఎనర్జీ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తమ 'మొబిలైజింగ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫర్ క్లిన్ ఎనర్జీ ఇన్ ఇమర్జింగ్ ఎకానమీస్  కార్యక్రమం ద్వారా తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, 'ఎనర్జీ లెర్నింగ్ ప్రోగ్రాం' ద్వారా యువతలో నైపుణ్యాలను పెంచుతామని తెలిపారు. సైబర్‌సెక్యూరిటీపై తమ సెంటర్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని, ఏపీ ప్రభుత్వానికి అవసరమైన సహకారం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa