నవంబర్ 19న బెంగళూరులో పట్టపగలే రూ. 7.11 కోట్ల నగదు దోపిడీ జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏటీఎంలలో నగదు నింపే ఏజెన్సీ వాహనాన్ని కేంద్ర ప్రభుత్వ స్టిక్కర్‌తో అడ్డగించిన ముఠా.. ఆదాయపు పన్ను అధికారులమంటూ నమ్మించి ఈ భారీ దోపిడీకి పాల్పడింది. ఈ కేసును 72 గంటల్లో పోలీసులు ఛేదించారు. ఆరు రాష్ట్రాల్లో 200 మంది పోలీసులు.. కుప్పలు తెప్పలుగా ఉన్న ఫోన్ డేటా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. ఒక పోలీసు కానిస్టేబుల్ సహా ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి దగ్గరి నుంచి రూ. 6.29 కోట్లు రకవరీ చేసుకున్నారు. నిందితులను గోవిందపుర పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ అప్పన్న నాయక్, సీఎమ్ఎస్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ సంస్థ మాజీ ఉద్యోగి జేవియర్, ట్రాన్స్‌పోర్టు వెహికిల్ ఇన్‌ఛార్జ్ గోపాల్ ప్రసాద్, వారి స్నేహితులు నవీన్, నెల్సన్, రవిగా గుర్తించారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ ముఠా పక్కా ప్లానింగ్ ప్రకారం చోరీకి పాల్పడింది. అందుకోసం మూడు నెలల పాటు ప్రణాళికలు రచించారు. 15 రోజులు రెక్కీ నిర్వహించారు. , సీసీటీవీ కమెరాలు లేని ప్రదేశాన్ని ఎంచుకున్నారు. పారిపోవడం, పోలీసులను తప్పుదారి పట్టించేందుకు నకిలీ నంబర్ ప్లేట్లతో కొన్ని వాహనాలను సిద్ధం చేసుకున్నారు. ఎవరికీ దొరక్కుండా.. వాట్సాప్ కాల్స్ ద్వారా వివిధ భాషలలో మాట్లాడుకునేవారు. ఈ నెల 19న ఏటీఎంలకు ఎక్కువ మొత్తంలో నగదు తీసుకెళ్తారన్న సమాచారంతో.. వాహనాన్ని అడ్డగించి.. ఆర్‌బీఐ, ఐటీ అధికారులమంటూ సిబ్బందిని బెదిరించారు. ఆ వాహనంలోని రూ. 7.11 కోట్లను వారి కారులోకి ఎక్కించుకుని పరారయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ముమ్మరంగా దర్యాప్తు చేశారు.
దర్యాప్తులో భాగంగా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, సౌత్ డివిజన్ సిబ్బంది.. కేరళ, తమిళనాడు, గోవా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వెళ్లారు. అనంతరం బెంగళూరుకు చెందిన ముగ్గురు నిందితులు అన్నప్ప, జేవియర్, గోపాల్ ప్రసాద్‌లను అరెస్టు చేసి.. వారి నుంచి రూ. 5.76 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురుని హైదరాబాద్‌లోని ఓ లాడ్జీలో అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 53 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే దొంగిలించిన సొమ్ము నుంచి ఇక రూ. 82 లక్షలు మిస్ అవుతున్నాయి.
దొంగలకు ట్రైనింగ్ ఇచ్చిన పోలీస్!
విచారణలో భాగంగా విస్తుపోయే విషయాలు తెలిశాయి. దొంగల ముఠాకు.. క్లూస్ ఏమాత్రం దొరకకుండా దొంగతనం ఎలా చేయాలో కానిస్టేబుల్ అప్పన్న నాయక్ ట్రైనింగ్ ఇచ్చారని పోలీసులు తెలిపారు. ఇక క్యాష్ వ్యాన్ ఎప్పుడు, ఎటువైపు వెళ్తుందో.. సీఎమ్ఎస్ సంస్థ మాజీ ఉద్యోగి సమాచారం ఇచ్చాడు. జేవియర్ డబ్బును ఓ వాహనంలో తీసుకుని పరారయ్యాడు. కాగా, చిత్తూరు జిల్లాలో డబ్బును తరలించిన వాహనం దొరికింది.
నగదు రవాణా చేసేటప్పుడు సీఎంఎస్ సంస్థ సరైన మార్గదర్శకాలు పాటించలేదని.. ఆ సంస్థ లైసెన్స్ క్యాన్సల్ చేయాలని కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ సూచించారు. కాగా ఈ కేసును విజయవంతంగా ఛేదించిన సిబ్బందిని అభినందిస్తూ.. 200 మంది పోలీసులకు రూ. 5 లక్షల నగదు బహుమతి ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa