బిహార్‌లోని పలు జిల్లాల్లో జరిపిన పరిశోధనలో బాలింతల తల్లిపాలల్లో ప్రమాదకరమైన యురేనియం ఆనవాళ్లు బయటపడ్డాయి. 6 జిల్లాల్లోని బాలింతల పాల నుంచి నమూనాలు సేకరించి.. అధ్యయనం చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 70 శాతం మంది శిశువులు ఈ కాలుష్యం బారిన పడే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఇది పిల్లల కిడ్నీలు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి.. భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పును పెంచుతుందని పేర్కొన్నారు. ఈ అధ్యయన ఫలితాలు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ.. తల్లిపాలు శిశువు రోగనిరోధక శక్తికి కీలకం కాబట్టి డాక్టర్ల సలహా లేకుండా తల్లిపాలు ఇవ్వడం ఆపకూడదని పరిశోధకులు సూచించారు.
డాక్టర్ అరుణ్ కుమార్, ప్రొఫెసర్ అశోక్ ఘోష్ నేతృత్వంలో పాట్నాలోని మహావీర్ క్యాన్సర్ సంస్థాన్.. డాక్టర్ అశోక్ శర్మ నేతృత్వంలో న్యూఢిల్లీలోని ఎయిమ్స్ - బయోకెమిస్ట్రీ విభాగం సంయుక్తంగా ఈ పరిశోధన చేపట్టాయి. 2021 అక్టోబర్ నుంచి.. 2024 జూలై వరకు ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనానికి బిహార్‌లోని భోజ్‌పూర్, సమస్తిపూర్, బెగుసరాయ్, ఖగారియా, కటిహార్, నలంద జిల్లాలను ఎంచుకున్నారు. ఈ 6 జిల్లాల్లోని 17 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్న 40 మంది బాలింతల నుంచి తల్లిపాల నమూనాలను సేకరించి విశ్లేషించారు.
ఈ అధ్యయనంలో భాగంగా పరీక్షించిన అన్ని నమూనాల్లోనూ యురేనియం ఉన్నట్లు తేలింది. వీటి గాఢత 0 నుంచి 5.25 మైక్రోగ్రామ్స్ పర్ లీటర్ వరకు ఉందని గుర్తించారు. ఖగారియా జిల్లాలో అత్యధిక సగటు కాలుష్యం నమోదు కాగా.. నలంద జిల్లాలో తక్కువగా ఉంది. ఇక కటిహార్ జిల్లాలోని ఒక నమూనాలో అత్యధిక రీడింగ్ నమోదైంది. సాధారణంగా తల్లిపాలల్లో యురేనియం ఉండకూడదు.. దీనికి నిర్దిష్ట పరిమితి అంటూ కూడా ఏదీ లేదు. ఇది పూర్తిగా అవాంఛనీయమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
70 శాతం మంది శిశువులకు పొంచి ఉన్న ముప్పు
ఈ అధ్యయన ఫలితాల ప్రకారం.. దాదాపు 70 శాతం మంది శిశువులు యురేనియం ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉందని తెలుస్తోంది. పసిపిల్లల అవయవాలు అభివృద్ధి దశలో ఉంటాయి కాబట్టి.. వారు పెద్దవారికంటే వేగంగా విషతుల్య లోహాలను గ్రహిస్తారు. తక్కువ శరీర బరువు ఉండటం వల్ల ముప్పు తీవ్రత ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యురేనియం కాలుష్యం వల్ల కిడ్నీలు దెబ్బతినడం, నాడీ వ్యవస్థ లోపాలు, మెదడు ఎదుగుదల మందగించడం, భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.
కాలుష్యానికి కారణమేంటి?
బిహార్‌లో ఇప్పటికే భూగర్భ జలాల్లో ఆర్సెనిక్, సీసం, పాదరసం వంటి విషపూరిత రసాయనాలు ఉన్నట్లు గతంలోనే వెల్లడైంది. తాగునీరు, సాగునీటి కోసం భూగర్భ జలాలపై ఎక్కువగా ఆధారపడటం.. పరిశ్రమల వ్యర్థాలను శుద్ధి చేయకుండా వదలడం.. రసాయన ఎరువులు, పురుగు మందులు అతిగా వినియోగించడం వల్ల భూగర్భ జలాలు కలుషితమై.. అది ఆహార గొలుసు ద్వారా మనుషుల శరీరంలోకి.. తద్వారా తల్లిపాలలోకి చేరుతోందని ఎయిమ్స్ డాక్టర్ అశోక్ శర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా దీని మూలాలను అన్వేషిస్తోంది.
పిల్లలకు పాలు ఇవ్వడం ఆపొద్దని సూచనలు
తల్లి పాలల్లో యురేనియం ఆనవాళ్లు ఉన్నట్లు తేలడం ఆందోళనకరంగా ఉన్నప్పటికీ.. దీనికి భయపడి తల్లులు.. తమ పిల్లలకు పాలు ఇవ్వడం ఆపకూడదని పరిశోధకులు స్పష్టం చేశారు. శిశువు రోగనిరోధక శక్తికి.. ప్రారంభ ఎదుగుదలకు తల్లిపాలు సాటిలేనివని పేర్కొన్నారు. డాక్టర్ల సలహా ఉంటే తప్ప తల్లిపాలు ఇవ్వడం కొనసాగించాలని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా అమెరికా, చైనా, పాకిస్తాన్ వంటి దేశాల్లో భూగర్భ జలాల్లో యురేనియం ఉన్నప్పటికీ.. తల్లిపాలలోకి చేరడం బిహార్‌లో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నీటి నాణ్యతను పరీక్షించాలని.. ప్రజారోగ్య చర్యలు చేపట్టాలని ఈ నివేదిక తీవ్రంగా హెచ్చరిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa