ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు లాంఛనంగా ప్రారంభమైన 'ఐఎన్ఎస్ మాహె' యుద్ధ నౌక

national |  Suryaa Desk  | Published : Mon, Nov 24, 2025, 05:20 PM

భారత నౌకాదళం తన అమ్ములపొదిలో మరో శక్తిమంతమైన ఆయుధాన్ని చేర్చుకుంది. తీర ప్రాంతాల్లో శత్రు జలాంతర్గాములను గుర్తించి, వాటిని ధ్వంసం చేయడమే లక్ష్యంగా రూపొందించిన 'మాహె' శ్రేణిలోని తొలి యుద్ధ నౌక ఐఎన్ఎస్ మాహెను నేడు లాంఛనంగా ప్రారంభించింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో-వాటర్ క్రాఫ్ట్ (ASW-SWC) రాకతో భారత తీర రక్షణ సామర్థ్యం, జలాంతర్గాములను వేటాడే శక్తి గణనీయంగా పెరగనుంది. దీనిని దేశీయంగా నిర్మించిన సరికొత్త తరం తీరప్రాంత యుద్ధ నౌకగా నేవీ అభివర్ణించింది.ఈ యుద్ధ నౌక నిర్మాణం 'ఆత్మనిర్భర్ భారత్' స్ఫూర్తికి నిలువుటద్దం పడుతోంది. ఇందులో 80 శాతానికి పైగా స్వదేశీ పరికరాలు, సాంకేతికతను వినియోగించారు. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) దీన్ని నిర్మించింది. ఈ ప్రాజెక్టు.. నౌకా నిర్మాణ రంగంలో భారత్ సాధించిన ప్రగతికి, వ్యవస్థల అనుసంధానంలో మనకున్న నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. తీరానికి సమీపంలో ఉండే జలాల్లో వేగంగా, శత్రువుల కంటపడకుండా, అత్యంత కచ్చితత్వంతో కార్యకలాపాలు నిర్వహించేలా దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.ఐఎన్ఎస్ మాహెను ప్రధానంగా తీర ప్రాంతాల్లోని లోతు తక్కువ నీటిలో ఆపరేషన్ల కోసం రూపొందించారు. పెద్ద యుద్ధ నౌకలు వెళ్లలేని ఇరుకైన జలాల్లో ఇది సులువుగా కదలగలదు. యాంటీ-సబ్‌మెరైన్ ఆపరేషన్లతో పాటు, తీరప్రాంత గస్తీ, సముద్ర గర్భంలో మైన్‌లను అమర్చడం, నీటి అడుగున నిఘా వంటి కీలక బాధ్యతలను ఇది సమర్థంగా నిర్వర్తిస్తుంది. దీని పొడవు 78 మీటర్లు కాగా, సుమారు 1,100 టన్నుల బరువును మోయగలదు. గంటకు 25 నాట్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించే ఈ నౌక, ఒకసారి ఇంధనం నింపుకుంటే 1,800 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించి, 14 రోజుల పాటు నిరంతరాయంగా విధుల్లో పాల్గొనగలదు. దాదాపు నిశ్శబ్దంగా ప్రయాణించే దీన్ని 'సైలెంట్ హంటర్' గా పిలుస్తారు.ఈ నౌకలో అత్యాధునిక స్వదేశీ ఆయుధ వ్యవస్థలను అమర్చారు. ఇంటిగ్రేటెడ్ కంబాట్ మేనేజ్‌మెంట్ సూట్, డీజిల్ ప్రొపల్షన్, అడ్వాన్స్‌డ్ పవర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, మీడియం-ఫ్రీక్వెన్సీ సోనార్, మల్టీ-ఫంక్షన్ సర్వైలెన్స్ రాడార్ వంటివి ఇందులో ఉన్నాయి. తేలికపాటి టార్పెడోలు, మల్టీ-రోల్ రాకెట్ లాంచర్లు, స్వీయ రక్షణ కోసం రిమోట్ కంట్రోల్డ్‌ 30 ఎంఎం గన్‌తో పాటు, మైన్‌లను అమర్చేందుకు ప్రత్యేక రైళ్లను కూడా అమర్చారు.మలబార్ తీరంలోని చారిత్రక పట్టణమైన మాహె పేరును ఈ నౌకకు పెట్టారు. దీని చిహ్నంపై కలరిపయట్టు యుద్ధ విద్యలో ఉపయోగించే 'ఉరుమి' అనే వంగే కత్తి చిత్రాన్ని ముద్రించారు. ఇది చురుకుదనాన్ని, కచ్చితత్వాన్ని, ప్రాణాంతకమైన సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఈ నౌక లక్షణాలు కూడా అవేనని నేవీ అధికారులు తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa