బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ.. వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో జరగనున్న పశ్చిమ్ బెంగాల్‌లోనూ కాషాయ జెండాను ఎగరువేయాలనే కృతనిశ్చయంతో ఉంది. మమతా బెనర్జీ, ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని, బీజేపీ ఎన్నికల యంత్రాంగం అప్పుడే కార్యాచరణ మొదలుపెట్టింది. బెంగాల్‌లో వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగుతాయని, బీహార్ విజయం ఇచ్చిన అత్మవిశ్వాసంతో దీదీని గద్దె దింపడానికి వ్యూహరచన చేసినట్టు ఆ పార్టీ వర్గాలు సోమవారం తెలిపాయి. కానీ కేవలం బీజేపీ ప్రధాన దృష్టంతా మమతా బెనర్జీపై మాత్రమే కాదని, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీని వ్యతిరేకించే తృణమూల్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటుందని పేర్కొన్నాయి.
వీలైనంత మేర టీఎంసీకి ఉన్న ఆదరణను తగ్గించడమే దీని లక్ష్యం. అయితే, తృణమూల్ అధినేత్రిని విస్మరించాలని కాదు. దీంతో పాటు ఎప్పటి మాదిరిగానే వారసత్వ రాజకీయాల అంశంపై కూడా బీజేపీ దృష్టి సారిస్తుంది. మమతా బెనర్జీ రాజకీయ వారసుడు ఆమె మేనల్లుడని ప్రచారం జరగుతుండగా... ప్రజల్లో ఆయనపై అంతగా సానుకూలత లేదనే సంకేతాలు వస్తున్నాయి. ఈ పరిస్థితి తమకు అనుకూలంగా మారి, క్షేత్రస్థాయి వనరులను తమవైపు తిప్పుకునేందుకు అవకాశం కల్పిస్తుందని పార్టీ వ్యూహం గురించి తెలిసిన ఓ బీజేపీ నేత అన్నారు.
కాగా, 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సువేందు అధికారి సహా టీఎంసీకి చెందిన ముఖ్య నేతలు బీజేపీలో చేరారు. దీదీకి కుడి భుజమైన సువేందు.. పార్టీలో అభిషేక్ పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతాను సువేందు ఓడించిన విషయం తెలిసిందే. కానీ, ఈసారి మాత్రం టీఎంసీకి చెందిన అసమ్మతి నేతలను పార్టీలోకి చేర్చుకునే ప్రణాళిక లేదని, దీని వల్ల పార్టీ ఓటు శాతం గణనీయంగా పెరుగుతుందని ఆశించడంలేదని వారు పేర్కొన్నారు.
దీనికి బదులు టీఎంసీ కార్యకర్తలను చేర్చుకుంటే బీజేపీ ఇంకా దూకుడుగా, మరింత సమర్థవంతంగా ఎన్నికల్లో ముందుకెళ్తుందని భావిస్తున్నారు. అంతేకాదు, పార్టీలో కొత్త నాయకులను చేర్చుకోవడం వల్ల ఇప్పటికే ఉన్నవారిని పక్కనబెట్టాల్సి వస్తుందని, కార్యకర్తలను చేర్చుకుంటే ఆ పరిస్థితి ఉండదని అంటున్నారు. బిహార్‌లో బీజేపీ, జేడీయూ సహా దాని మిత్రపక్షాలు కుల సమీకరణాలను సరిగ్గా అమలు చేసి విజయం సాధించాయి. కానీ, బెంగాల్‌లో పరిస్థితి దీనికి విరుద్దం. ఇతర రాష్ట్రాలతో పోల్చితే అక్కడ కుల రాజకీయాలకు అంతగా ఆస్కారం లేదు. అందుకే ఇక్కడ బీజేపీ ప్రాంతీయ, మత సమీకరణాలపై ఫోకస్ పెట్టింది.
హిందూ-ముస్లిం సమీకరణాలు
బెంగాల్‌లో ముస్లిం జనాభా సుమారు 30 శాతంగా ఉంటుంది. కానీ, కేవలం 30 నుంచి 40 స్థానాల్లోనే వీరి ప్రభావం ఉంటుంది. బీజేపీ విశ్లేషణ ప్రకారం.. ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో టీఎంసీకి గణనీయంగా ఓట్లు వస్తాయి. కానీ ఇది చాలా కొద్ది నియోజకవర్గాలకు పరిమితం కావడంతో ఆ పార్టీ గెలుచుకునే స్థానాల సంఖ్యపై పెద్దగా ప్రభావం ఉండదు. ఎన్నికలో గెలిచిన స్థానాలే కీలకం కానీ ఓట్లు కాదు. దీనికి కౌంటర్‌గా ఇతర ప్రాంతాల్లో హిందూ ఓటర్లను ఆకట్టుకోవడం ద్వారా లబ్ది పొందాలని బీజేపీ ఆశిస్తోంది. ఈ విషయంలో తమ పార్టీ బలమైన స్థితిలో ఉందని, పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక బీజేపీ నేత అన్నారు.
ఇతర అంశాలు
గత కొన్నేళ్లుగా బంగ్లాదేశ్ చొరబాటుదారుల విషయంలో పదేపదే మమతా బెనర్జీపై బీజేపీ దాడి చేస్తోంది. సరిహద్దులు దాటి వచ్చిన అక్రమ చొరబాటుదారులు ఓటర్ల జాబితాలో చేరుతున్నప్పటికీ.. ఆమె కన్నెత్తి చూడటం లేదని ఆరోపిస్తోంది. అయితే, తృణమూల్ మాత్రం బీజేపీని స్థానికేతరులని ఆరోపిస్తోంది. గుజరాత్ (ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా) నుంచి వచ్చే శక్తులు ‘బెంగాల్ వ్యతిరేకులు’ అని ఎదురుదాడి చేస్తోంది.
కాగా, 2019, 2024 లోక్‌సభ, 2016, 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 100కిపైగా స్థానాల్లో విజయం సాధించింది. ఇది బెంగాల్‌లో ఆ పార్టీకి పెరుగుతున్న ప్రాధాన్యతను సూచిస్తుంది. ఈ ప్రాంతాలపై దృష్టి పెట్టి, టార్గెట్‌గా పెట్టుకున్న 160 నుంచి 170 స్థానాలను గెలవడానికి బీజేపీ బలంగా ప్రణాళికలు వేస్తోంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్త తప్పనిసరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa