ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్ఐఆర్ ఎఫెక్ట్.. 3 వారాల్లో 16 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు మృతి

national |  Suryaa Desk  | Published : Tue, Nov 25, 2025, 09:06 PM

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ఎంత వివాదాస్పదం అయిందో మనకు తెలిసిందే. ఇప్పుడు త్వరలో ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఈ ఎస్ఐఆర్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇలాగే దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని.. యోచిస్తోంది. అయితే ఈ ఎస్ఐఆర్‌ను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఉండే వారి ఓట్లను తొలగిస్తున్నారని.. భారీగా బోగస్ ఓట్లను సృష్టిస్తున్నారని.. బహిరంగంగానే విమర్శలు చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ.. ఓట్ల చోరీ ఆరోపణలు చేస్తూ.. ఇప్పటికే పలు ప్రెస్‌మీట్‌లు పెట్టి.. కొన్ని ఆధారాలను ప్రజల ముందు ఉంచారు. ఈ క్రమంలోనే తాజాగా కీలక సంఘటనలు జరుగుతున్నాయి.


ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ విధుల్లో నిమగ్నమైన బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్న తీవ్రమైన పనిభారం, ఒత్తిడి కారణంగా ఇటీవల కాలంలో కనీసం 9 మంది మరణించారు. కొన్ని నివేదికల ప్రకారం మొత్తం 16 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ మరణాలు రాజకీయ వివాదానికి దారితీయగా.. కేంద్ర ఎన్నికల సంఘం విధానాలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఇప్పటివరకు జరిగిన మరణాలు.. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో నమోదు అయ్యాయి.


బీఎల్ఓల మరణాలపై రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా ప్రతిపక్ష నేతలు ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎస్ఐఆర్ పేరుతో దేశవ్యాప్తంగా గందరగోళం సృష్టించారని.. 3 వారాల్లో 16 మంది బీఎల్ఓలు ప్రాణాలు కోల్పోయారని రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ ఎస్ఐఆర్ సంస్కరణలు కావని.. బలవంతంగా రుద్దుతున్న నిరంకుశత్వమని రాహుల్ గాంధీ విమర్శించారు.


ఒక మనిషి చేయాల్సిన పనికంటే ఎక్కువగా బీఎల్ఓలు పనిచేస్తున్నారని.. ఎన్నికల సంఘం వెంటనే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఇంకా ఎన్ని ప్రాణాలు కోల్పోవాలి.. ఈ ఎస్ఐఆర్ కోసం ఇంకెన్ని మృతదేహాలు చూడాలని ఆమె ప్రశ్నించారు. మరోవైపు.. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను అధికార బీజేపీ ఖండించింది. ఈ మరణాలను ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయని.. బీఎల్ఓలకు వనరులు కల్పించడంలో ఆయా రాష్ట్రాలు విఫలం అయ్యాయని ఆరోపించింది.


ఈ పనిభారం ఎంత తీవ్రంగా ఉందో వెల్లడిస్తూ పలు ఉదాహరణలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న పింకీ సింగ్.. 1179 మంది ఓటర్ల ధృవీకరణ పనిని, విద్యార్థులకు చదువు చెప్పే పనిని ఏకకాలంలో నిర్వహించడం అసాధ్యమని పేర్కొంటూ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇక పశ్చిమ బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాల జిల్లాకు చెందిన కమల్ నస్కర్ అనే బీఎల్ఓ.. ఎస్ఐఆర్ పని ఒత్తిడితో ఆస్పత్రి పాలయ్యారు. నాడియా జిల్లాలో రింకూ తరఫ్‌దార్ అనే బీఎల్ఓ పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. కేరళ, రాజస్థాన్, గుజరాత్‌లలో కూడా ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa