ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్యంత డేంజర్ జోన్‌లో భారత్ హిమాలయాలు

national |  Suryaa Desk  | Published : Fri, Nov 28, 2025, 08:11 PM

కొత్త భూకంప మ్యాప్‌ను భారత్ శుక్రవారం ఆవిష్కరించింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సవరించిన భూకంప రూపకల్పన కోడ్‌లో భాగంగా పూర్తి మార్పులు చేసి భూకంప ప్రమాద జోన్ల మ్యాప్‌ను విడుదల చేసింది. ఇందులో, మొత్తం హిమాలయ ప్రాంతాన్ని తొలిసారిగా అత్యధిక ప్రమాదకర జోన్‌ (కొత్తగా ప్రవేశపెట్టిన జోన్ VI)లో గుర్తించారు. భారత భూకంప ప్రమాద అంచనాల్లో దశాబ్దాల తర్వాత జరిగిన అత్యంత ముఖ్యమైన మార్పులలో ఒకటిగా దీనిని పరిగణించాలి. తాజా మ్యాప్ ప్రకారం.. దేశంలోని 61% భూభాగం మధ్యస్థ నుంచి అధిక ప్రమాదకర జోన్‌ పరిధిలోకి చేరింది. గతంలో టెక్టోనిక్ ప్రమాదం ఉన్నప్పటికీ హిమాలయ ప్రాంతం జోన్ 4, 5గా విడిపోయి ఉండేది. కానీ, ప్రస్తుతం మొత్తం హిమాలయ ప్రాంతాన్ని అత్యధిక ప్రమాదకర జోన్‌ VIగా వర్గీకరించారు.


పాత మ్యాప్‌లు ముఖ్యంగా మధ్య హిమాలయాల్లో ప్రమాదాలను తక్కువగా అంచనా వేశాయి, ఎందుకంటే ఆ ప్రాంతంలోని అనేక ఫాల్ట్ లైన్ల వద్ద దాదాపు 200 ఏళ్లుగా భారీ భూకంపం సంభవించలేదు. ఈ దీర్ఘకాలిక నిశ్చలత కారణంగానే అక్కడ భారీ భూకంపం వచ్చే అవకాశాలు ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హిమాలయాలు భూకంపాల ముప్పు జోన్‌లో ఉన్నాయి ఎందుకంటే భూమిపై అత్యంత చురుకైన టెక్టోనిక్ ప్లేట్లు అక్కడే కలుసుకుంటున్నాయి. భారతీయ ప్లేట్.. యురేషియా ప్లేట్‌లోకి సంవత్సరానికి ఐదు సెంటీమీటర్ల వేగంతో చొచ్చుకుపోతోంది. ఈ బలమైన కదలికలు హిమాలయాలను సృష్టించి, వాటిని ఇంకా పైకి నెడుతోంది.


ఈ నిరంతర ఘర్షణ భూమి పొరలో విపరీతమైన ఒత్తిడిని పెంచుతుంది. ఆ ఒత్తిడి అకస్మాత్తుగా పెరిగినప్పుడు శక్తివంతమైన భూకంపాలకు దారితీస్తుంది. ఈ ప్రాంతం భౌగోళికంగా కూడా చాలా కొత్తది. అంటే అక్కడి శిలలు ఇంకా సర్దుబాటు అవుతున్నాయి. దీనివల్ల పర్వతాలు మరింత అస్థిరంగా మారాయి. మెయిన్ ఫ్రంటల్ థ్రస్ట్, బౌండరీ థ్రస్ట్, సెంట్రల్ థ్రస్ట్ వంటి అనేక ప్రధాన ఫాల్ట్ వ్యవస్థలు ఈ పర్వత శ్రేణి కింద ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి పెద్ద భూకంపాలను సృష్టించగలదు. శతాబ్దాలుగా పెద్ద భూకంపాలు సంభవించని సుదీర్ఘ భూకంప ఖాళీలను కూడా భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి కింద గణనీయమైన శక్తి నిల్వ ఉన్నట్టు సూచిస్తుంది. ఈ కారణాలన్నీ కలిసి హిమాలయాలను ప్రపంచంలోనే అత్యంత భూకంపాలు సంభవించే ప్రాంతాలలో ఒకటిగా మార్చాయి.


భూకంపాలు ఎందుకు వస్తాయి?


భూమి లోపల ఉండే రెండు పెద్ద రాతి పలకలు నిరంతరం కదులుతూ ఉంటాయి. హిమాలయాల కింద ఇండియా ప్లేట్, యురేషియా ప్లేట్‌లోకి నెట్టుకుంటూ వెళ్తోంది. ఈ నెట్టడం వల్ల భూమి లోపల ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి ఒక్కసారిగా విడుదలైనప్పుడు భూకంపం వస్తుంది.


తాజా మ్యాప్‌లో హిమాలయన్ ఫ్రంటల్ థ్రస్ట్ వెంట దక్షిణ దిశగా విస్తరించే భూకంప అవకాశాలను పరిగణలోకి తీసుకున్నారు. దీని వల్ల మోహంద్ సమీపంలోని డెహ్రాడూన్ వంటి ప్రాంతాలకూ భూకంప ప్రమాదం పెరిగినట్లు గుర్తించారు. బాహ్య హిమాలయ ప్రాంతాల్లోని ఫాల్ట్ లైన్లు వద్ద జనాభా అధికంగా ఉన్నచోట భూకంప ప్రమాదం ఉంది. అందువల్ల వీటిని మళ్లీ అధిక ప్రమాద జోన్‌గా గుర్తించారు.


ఇకపై పరిపాలనాపరమైన సరిహద్దులు కాకుండా భౌగోళిక, శాస్త్రీయ వాస్తవాల ఆధారంగా ప్రమాదాన్ని అంచనా వేయనున్నారు. అతి ప్రమాదకర ప్రాంతాల్లో భవనాలు, వంతెనలు, నగర మౌలిక వసతుల రూపకల్పనలో మరింత కఠినమైన ప్రమాణాలను అనుసరించాల్సిన అవసరాన్ని ఇది నొక్కిచెబుతుంది. భారత-యురేషియా టెక్టానిక్ ప్లేట్స్ ఒకదానినొకటి ఢీకొట్టడం కొనసాగుతుండగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లో భూగర్భంలో ఒత్తిడి నిరంతరం పెరుగుతోందని ఈ మ్యాప్ తెలియజేస్తోంది. జనసాంద్రత ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాంతాలకు ముప్పు మరింత తీవ్రమవుతోంది.


పాత భవనాలను భూకంప నిరోధకంగా మార్చడం, మృదువైన నేల, క్రియాశీలక ఫాల్ట్‌లపై కొత్త నిర్మాణాలను నిలిపివేయడం, పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో ఈ కొత్త వర్గీకరణ భూకంప నిరోధక శక్తిని పెంపొందించే దిశగా కీలక అడుగు అని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా విపత్తు సంసిద్ధతను పూర్తిగా పునఃసమీక్షించాల్సిన అవసరాన్ని, దీర్ఘకాలిక భద్రతా ప్రణాళికలలో కొత్త మార్గాలను అనుసరించాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa