బంగ్లాదేశ్‌లోని పిరోజ్‌పూర్ జిల్లాలోని దుమ్రితాలా గ్రామంలో హిందూ కుటుంబానికి చెందిన కనీసం ఐదు ఇళ్లకు నిప్పు పెట్టారు. డిసెంబరు 28న జరిగిన సంఘటనను మైనారిటీలపై లక్ష్యంగా చేసుకున్న దాడిగా అనుమానిస్తున్నారు. దీనికి పది రోజుల ముందు డిసెంబర్ 18న మైమన్సింగ్లో దైవదూషణకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ 29 ఏళ్ల దీపు చంద్ర దాస్‌ను గుంపు కొట్టిచంపి, శవాన్ని చెట్టుకు వేలాడదీసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. స్థానిక అధికారులు వెల్లడించిన ప్రకారం.. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించలేదు. దాడి చేసినవారు ఒక గదిలో గుడ్డలు కుక్కి నిప్పు పెట్టారని, దీంతో మంటలు వేగంగా వ్యాపించాయని నివేదికలు చెబుతున్నాయి. అక్కడ నుంచి మీడియాతో మాట్లాడిన బాధిత కుటుంబం భయంతో వణికిపోతోంది. మంటలు ఎలా అంటుకున్నాయో తమకు తెలియదని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని వారు చెప్పారు. పొరుగు దేశంలో హిందువులు సహా మైనార్టీలపై జరుగుతోన్న దాడుల విషయంలో భారత్ ఇప్పటికే స్పందించింది.
తెల్లవారుజామున తాము నిద్రలో ఉండగానే మంటలు చెలరేగాయని, బయట నుంచి తలుపులు గడియ పెట్టడంతో లోపల చిక్కుకుపోయామని బాధితులు తెలిపారు. అదృష్టవశాత్తూ రెండు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది ఈ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ఇంట్లోని వస్తువులు, విలువైన సామాగ్రి, జంతువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ సంఘటన రాజధాని ఢాకాకు సుమారు 240 కిలోమీటర్ల దూరంలో ఉంది.
పిరోజ్‌పూర్ ఎస్పీ మొహమ్మద్ మంజుర్ అహ్మద్ సిద్ధిఖీ సంఘటనా స్థలాన్ని సందర్శించి, ఘటనపై త్వరగా దర్యాప్తు చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. ఐదుగురు అనుమానితులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతుందని, మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో స్థానికులు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తుండగా, అనేక ఇళ్లకు అవి వ్యాపించాయి.
బంగ్లాదేశ్ మైనార్టీల మానవహక్కుల కాంగ్రెస్ నివేదిక ప్రకారం... ఈ ఏడాది జూన్ నుంmr డిసెంబర్ వరకు హిందూ మైనారిటీలపై దైవదూషణ ఆరోపణలకు సంబంధించిన కనీసం 71 సంఘటనలు నమోదయ్యాయి. చంద్పూర్, చిట్టగాంగ్, దినాజ్‌పూర్, లాల్మోనిర్హాట్, సునమ్‌గంజ్, ఖుల్నా, కొమిల్లా, గజిపూర్, టాంగైల్, సిల్హెట్ వంటి 30కి పైగా జిల్లాల నుంచి హెచ్ఆర్సీబీఎం కేసులను నమోదు చేసింది. ఈ కేసులు మైనారిటీలు మతపరమైన ఆరోపణలకు గురయ్యే వ్యవస్థాగత దుర్బలత్వాన్ని చూపుతున్నాయని హక్కుల బృందం పేర్కొంది. నివేదిక ప్రకారం.. బంగ్లాదేశ్‌లో దైవదూషణ ఆరోపణలు తరచుగా పోలీసు చర్యలు, మూక హింస, శిక్షలకు దారితీస్తాయి.
బంగ్లాదేశ్‌లో భారతదేశ వ్యతిరేక భావాలు పెరుగుతున్నాయి. సుమారు 17.5 కోట్ల జనాభా కలిగిన దేశంలో సుదీర్ఘ రాజకీయ అస్థిరత మతపరమైన సంప్రదాయవాదం వైపు మళ్లుతున్నట్లు ఆరోపణలున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా తప్పుకున్నప్పటి నుంచి అక్కడ ఇస్లామిక్ వేర్పాటువాదం పెరుగుదల ఆందోళనకు గురిచేస్తోంది. 1971 విమోచన యుద్ధ వారసత్వాన్ని తుడిచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్‌తో పూర్తిగా సంబంధాలు దెబ్బతింటుంటే.. లక్షలాది మంది హింసించి, దురాగతాలకు పాల్పడిన పాకిస్థాన్‌తో సాన్నిహిత్యం పెరుగుతోంది.
బంగ్లాదేశ్‌లోని రాజకీయ వేదికల నుంచి భారత వ్యతిరేక ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ముహమ్మద్ యూనస్ ఈశాన్య రాష్ట్రాల గురించి చేసిన ప్రకటన అనంతరం రెచ్చగొట్టే వ్యాఖ్యలు వస్తున్నాయి. అనేక తీవ్రవాద సమూహాలు పెరుగుతున్న భారత వ్యతిరేక భావాలను ఉపయోగించుకుని మైనారిటీలపై దాడులను సమర్థించుకుంటున్నాయి. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ముసుగులో తీవ్ర ఇస్లామిక్ ఎజెండాను ముందుకు తీసుకెళ్తున్నాయి. బంగ్లాదేశ్‌లో వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనుండగా.. మైనారిటీలపై మళ్లీ హింస పెరగడం ఆందోళనలను రేకెత్తిస్తోంది.
ఈ నెల ప్రారంభంలో మైమెన్సింగ్ జిల్లా బాలుకలో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్ (27) దైవదూషణ ఆరోపణలపై మూక దారుణంగా కొట్టిచంపి, రోడ్డుపై చెట్టుకు అతడి మృతదేహాన్ని వేలాడదీసి మంటల్లో తగులబెట్టింది. ఈ హత్యకు సంబంధించి సుమారు 12 మందిని అరెస్టు చేశారు. మరో హిందూ వ్యక్తి, అమృత్ మండల్, అలియాస్ సామ్రాట్ డిసెంబర్ 24న రాజ్‌బారి టౌన్లో మూక దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. అయితే, మండల్ హత్య, దోపిడీ సహా అనేక తీవ్రమైన కేసులలో నిందితుడని, ఈ సంఘటన మతపరమైన దాడి కాదని బంగ్లాదేశ్ ప్రభుత్వం పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa